ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం

Updated on: Jan 09, 2026 | 5:31 PM

ప్రపంచంలోనే అతిపెద్ద, 210 టన్నుల బరువైన ఏకశిలా శివలింగం తరలింపు బీహార్‌లో నిలిచిపోయింది. గోపాల్‌గంజ్ వద్ద నారాయణి నదిపై వంతెన శిథిలావస్థకు చేరడంతో భారీ ట్రైలర్‌కు మార్గం మూసుకుపోయింది. 3,178 కి.మీ. ప్రయాణం తర్వాత అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు, కానీ అన్నీ సమస్యలతో కూడుకున్నవే. ఈ భారీ రవాణా ఒక పెద్ద సవాలుగా మారింది.

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన ఏకశిలా బ్లాక్‌ గ్రానైట్‌ శివలింగాన్ని తరలించడం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా అధికారులకు సవాలుగా మారింది. నారాయణి నది పై వంతెన శిథిలావస్థకు చేరడంతో శివలింగం ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేసిన ఈ శివలింగం ఆదివారం బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చేరుకుంది. ఈ శివలింగం బరువు సుమారు 210 టన్నులు కాగా, దీనిని తరలిస్తున్న 106 చక్రాల ప్రత్యేక ట్రైలర్ బరువు మరో 160 టన్నులు. ఈ రెండింటి మొత్తం బరువును వంతెన మోయలేదని, తనిఖీల్లో వంతెనపై చాలాచోట్ల పగుళ్లు ఉన్నట్లు గుర్తించడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు నేషనల్‌ హైవేస్ అథారిటీ ఆఫ్‌ ఇండియా, బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ (BRPNNL) బృందాలను పిలిపించినట్లు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సిన్హా తెలిపారు. బీహార్ మంత్రి అశోక్ చౌదరి కూడా గోపాల్‌గంజ్‌కు వచ్చి వంతెనను స్వయంగా పరిశీలించారు. ఈ శివలింగాన్ని మోతిహారిలోని విరాట్ రామాయణ్ ఆలయానికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం మహాబలిపురం నుంచి 3,178 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 45 రోజుల్లో ఈ వాహనం ఇక్కడికి చేరుకుంది. మోతిహారికి చేరుకోవడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, వాటి పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు. ఒక మార్గంలోని వంతెన సామర్థ్యం సరిపోదని, మరో మార్గంలో కూడా అనేక చిన్న వంతెనలు, కల్వర్టులు ఉండటంతో భారీ వాహనం ప్రయాణించడం కష్టమని తేలింది. దీంతో శివలింగాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది

గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్‌

నౌక పెట్టిన అగ్గి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ??

వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను ఎలా బంధించారంటే ?? ఏఐ వీడియో

జేఎఫ్‌-17 యుద్ధ విమానాలపై.. దోస్త్‌ మేరా దోస్త్‌