లేటు వయసులో ఘాటు ప్రేమ..వృద్ధాశ్రమంలో ఒకటైన జంట
వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. కానీ వాళ్లు ఏమీ వయసులో లేరు. వృద్ధాశ్రమంలో ఉన్న ఆ వృద్ధుల మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటి కంటే.. ఇప్పుడే ఒకరికి మరొకరి తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. అందుకే తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని వృద్ధాశ్రమం నిర్వాహకులకు చెప్పారు. అంతే ఇంకేముంది వృద్ధాశ్రమంలోనే దండలు మార్చి పెళ్లిని జరిపించారు నిర్వాహకులు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి.. వారిద్దరినీ ఒకటి చేశారు. రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఈ అపురూప ఘట్టానికి వేదికైంది.
వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ, రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మడగల మూర్తి ఇద్దరూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఎవరో ఒకరి సాయం తప్పనిసరి. ఆ సమయంలో రాములమ్మ సహకారంతో మూర్తి కోలుకున్నారు. తనపై రాములమ్మ చూపిన ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకోవాలని మూర్తి భావించాడు. స్వర్ణాంధ్ర వృద్దాశ్రమం నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు తన మనసులోని మాట చెప్పేశాడు. రాములమ్మ కూడా మూర్తిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటంతో వారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆశ్రమంలోనే తోటి వృద్దుల సమక్షంలో మదర్ థెరిసా విగ్రహం సాక్షిగా వారిద్దరూ దండలు మార్చకున్నారు. చివరి శ్వాస వరకు ఇద్దరం ఒకరికొకరం కలిసి ఉంటామని ప్రమాణం చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లతో వృద్ధ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.