Viral Video: ఎప్పుడూ ప్రజలకు వచ్చిన ఇబ్బందులపై వార్తలను చదివే ఓ టీవీ యాంకర్ తన బాధను తానే వెళ్ళబోసుకున్నాడు. అందరి కష్టాలను వార్తల రూపంలో చదివే ఆ యాంకర్ కి ఎంత బాధ వేసిందో కానీ, ఒక్కసారిగా టీవీలో లైవ్ వార్తలు చదువుతూ.. ఆగిపోయి.. తన బాధ వినమని ప్రేక్షకులను కోరాడు. తరువాత అతను తన సంస్థ తనకు జీతం ఇవ్వలేదంటూ లైవ్ లో చెప్పుకుని వాపోయాడు. ఈ సంఘటన ఓ జాంబియం టీవీ ఛానల్ లో జరిగింది. కేబిఎన్ అనే న్యూస్ ఛానల్ లో టివి న్యూస్ ప్రెజెంటర్ కబీండా కాలిమినా వార్తలు చదువుతున్నాడు. వార్తల ముఖ్యాంశాలు చదివిన తరువాత అకస్మాత్తుగా టీవీ లైవ్ ను ఆపుచేయించాడు. తరువాత ఎవరూ ఊహించని విధంగా KBN TV (కెన్మార్క్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్) పై ఆరోపణలు గుప్పించాడు.
లేడీస్ అండ్ జంటిల్ మన్ మేము మనుషులం. మాకూ డబ్బు అవసరం ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తు మాకు కేబీఎన్ లో డబ్బులు ఇవ్వడం లేదు. నాకే కాదు.. షారన్ తో పాటు ఎవరికీ కూడా డబ్బు చెల్లించలేదు. అంటూ చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి కేబీఎన్ అతని బులిటిన్ తెసివేసింది. అయితే, న్యూస్ ప్రెజెంటర్ కబీండా కాలిమినా తన ఫేస్ బుక్ లో ఈ వీడియోను పంచుకున్నాడు.
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రజలు న్యూస్ టీవీ సిబ్బందికి సానుభూతి వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా కామెంట్లు చేసి కేబీఎన్ వారికీ జీతాలు చెల్లించాలని సూచించారు. ఈ వీడియోను వేలాది మంది చూశారు. చాలా మంది ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇక్కడ మీరూ చూడొచ్చు..
అయితే, ఈ ఫేస్ బుక్ పోస్ట్ పై KBN TV (కెన్మార్క్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్) తీవ్రంగా స్పందించింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తీ తాగి మాట్లాడాడు అంటూ చెప్పుకొచ్చింది. కేబీఎన్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెన్నెడీ మాంబ్వే ఫేస్ బుక్ లో ఒక ప్రకటన చేశారు. దానిలో ”KBN TV గా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్ ద్వారా ప్రదర్శించబడిన తాగుబోతు ప్రవర్తనతో మేము భయపడుతున్నాము. అతను మా పార్ట్ టైం న్యూస్ ప్రెజెంటర్ లలో ఒకరు” అని చెప్పారు.
మా సిబ్బంది తమ ఫిర్యాదులను చెప్పడానికి మా దగ్గర మంచి వ్యవస్థ ఉంది. దాని ద్వారా అతని సమస్య ఏదైనా ఉంటె పరిష్కరించుకుని ఉండొచ్చు. కానీ, అనవసర రాద్ధాంతం చేశాడు. ఆ నీచమైన ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ ‘వన్-నైట్ స్టంట్ ఆఫ్ ఫేమ్’ను ధిక్కారంగా భావించాలని ప్రజలను, సభ్యులను కోరుతున్నాము.” అంటూ ఆ ప్రకటన సాగింది.