
Viral Video: మరణం ఎప్పుడు.. ఎలా ముంచుకొస్తుందో ఎవరం చెప్పలేము. జీవితం ఓ నీటి బుడగలాంటిదని, ఏ క్షణంలోనైనా పేలుతుందని వేదాంతం చెబుతుంటారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటాడు. ఇలా రెప్పపాటు క్షణంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించిన వీడియోలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెటిజన్లను భయాందోళనకు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే సూరత్‌లోని గోల్డ్ జిమ్‌లో ఓ 33 ఏళ్ల యువకుడు కసరత్తులు చేస్తున్నాడు. ప్రతీ రోజూ లాగే ఆ రోజు కూడా ఆ యువకుడు వ్యాయామం చేశాడు. అయితే గుండెల్లో ఏదో తెలియని నొప్పి అతడిని బాధించింది దీంతో జిమ్‌లో ఉన్న మెట్లపై కూర్చున్నాడు. గుండెలో మంటగా ఉండడంతో నీరు తాగి ఉపశమనం పొందడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ నొప్పిమాత్రం తగ్గలేదు. ఇలా బాధపడుతుండగానే చివరికి ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీరా యువకుడిని పరీక్షించిన వైద్యులు అతను పడగానే మరణించినట్లు ధృవీకరించారు. గుండె ఆగిపోవడం వల్లే (కార్డియాక్ అరెస్ట్) ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన అంతా జిమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 33 ఏళ్ల అతి చిన్న వయసులో గుండె పోటుతో మరణించడంతో ఈ అంశం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే యువకుడు పరిమితికి మించి వ్యాయామం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ఉన్న ఫలంగా గుండె పనితీరు ఆగిపోవడాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. శరీరంలో ముందస్తు లక్షణాలు ఏమి కనిపించకుండానే ఈ సమస్య వస్తుంది. సాధారణంగా గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే దీనికి కారణం. ఈ అలజడి ఫలితంగా గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతింటుంది. దీనివల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా పోతుంది. దీనివల్ల క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, నాడి కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది.
Also Read: Farah Khan: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వదలని మహమ్మారి.. కోవిడ్ బారిన పడిన ఫరా ఖాన్..
SBI Customers: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. మీరు ఎంత రుణం పొందవచ్చో ఇలా తెలుసుకోండి..