కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్ వీడియో
డబ్బు మనిషి అవసరం తీరుస్తుంది. అదే డబ్బు మనిషిని అథపాతాళానికి తొక్కేస్తుంది. పైసా ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు.. దాన్ని ఎలా సంపాదించావన్నదే ముఖ్యం. అయితే ఈ కాలంలో కాయాకష్టం చేసి సంపాదించే కన్నా.. ఈజీ మనీ కోసం వెంపర్లాడే జనమే ఎక్కువైపోయారు. ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. కొందరైతే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ పరిస్థితికి కారకులెవరు? జనాన్ని ఈజీ మనీ ఉచ్చులోకి లాగి వారి జీవితాలను బుగ్గి పాలు చేయడం వెనుక ఎవరున్నారు?సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో మంచిని స్వీకరిస్తే పర్లేదు.. కానీ చెడువైపు మొగ్గితేనే ఇబ్బందంతా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా బెట్టింగ్ యాప్స్ దర్శనమిస్తున్నాయి.
ఒక్క బటన్ నొక్కితే చాలు ఊహించనంత డబ్బు మీ అకౌంట్లో పడుతుందని ఆశ చూపిస్తున్నాయి. ఇలాంటి వాటి ఉచ్చులో పడి మోసపోతున్న వారిలో 70శాతం మంది టీనేజర్లే. తెలిసీ తెలియని వయసు. యూట్యూబ్, ఇన్స్టా ప్రభావం వెరసి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ వెనుక భయపెట్టే నిజాలను గమనిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 9 కోట్లు. ఇది ఏటా 30 శాతం వరకు పెరుగుతోంది. అయితే వీటిలో మెజార్టీ యాప్స్ భారత్ కేంద్రంగా పనిచేయవు. విదేశాల్లో ముఖ్యంగా చైనా కేంద్రంగా ఉండే ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. అందినకాడికి డబ్బు దండుకుని ఆ తర్వాత మొండి చేయి చూపుతున్నాయి. మొదట సరదాగా మొదలయ్యే ఆన్ లైన్ ఆటలు ఆ తర్వాత వ్యసనంగా మారుతున్నాయి. రూపాయికి 10 రూపాయలు వస్తుందన్న ఆశ, పోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవాలన్న తాపత్రయం వెరసి స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి అందినకాడికి డబ్బులు అప్పుగా తీసుకుంటున్నారు. అదీ సరిపోక క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్‌లు, రమ్మీ, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టి అప్పుల పాలైనవారు కోకొల్లలు. ఇలా రుణపాశంలో చిక్కుకొని చివరికి అదే యమపాశంగా మారడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి, కట్టుకున్న వారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో