పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం, మంగళవారం లోక్‌సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా.. ఎంపీలతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతోపాటు తొలిరోజున 280 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు. రెండో రోజు మిగతా సభ్యులు ప్రమాణం చేస్తారు.
అంతకుముందు ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మహతాబ్ చేత ప్రమాణం చేయించారు. ముందుగా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఇంటికి వెళ్లారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ప్రమాణ స్వీకారం కోసం ప్రొటెం స్పీకర్‌ను తన కారులో తోడ్కొని వెళ్లారు రిజిజు..
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. కొత్త లోక్‌సభ సభ్యులకు స్వాగతమని.. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలంటూ ఆకాంక్షించారు. ప్రజలు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చారన్నారు. తమ విధానాలకు, తమ అంకితభావానికి జనామోదం లభించిందన్నారు. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం.. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామంటూ మోదీ తెలిపారు.