Big News Big Debate:  కొత్త పొత్తుతో NDAలో జనసేన ఉన్నట్టా.. లేనట్టా?

Big News Big Debate: కొత్త పొత్తుతో NDAలో జనసేన ఉన్నట్టా.. లేనట్టా?

Ram Naramaneni

|

Updated on: Sep 14, 2023 | 9:30 PM

ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చింది... వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు అధికారికం అయింది. చంద్రబాబును జైలులో పరామర్శించిన తరువాత పవన్ కల్యాణ్‌ పొత్తులపై కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ నేరుగా చంద్రబాబును కలిసి పొత్తు ప్రకటించిన పవన్ విషయంలో బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

పొత్తులపై పవన్‌కల్యాణ్‌ మనసులో మాట చెప్పేశారు.. చంద్రబాబునాయుడి మాటగా ఆయన తనయుడు లోకేష్‌ కూడా పొత్తును ఎండార్స్‌ చేశారు. మొత్తానికి ఏపీలో చాలాకాలంగా పొత్తులపై ఉన్న సందిగ్ధత తొలగింది.. టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారమే జరిగింది. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు వచ్చిన జనసేన అద్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. ఎన్నికల్లో టీడీపీతో కలిసే వెళతామని స్పష్టం చేశారు. త్వరలోనే జాయింట్‌ కమిటీ వేసి కార్యాచరణ ప్రకటిస్తామని అటు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ కూడా ప్రకటించారు. ఉమ్మడి అజెండాతో కలిసి ముందుకు సాగాలని చంద్రబాబునాయుడు – పవన్‌ కల్యాణ్‌ కలిసి నిర్ణయం తీసుకున్నారన్నారు నారా లోకేష్‌.

టీడీపీ – జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపాయి. బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందని పవన్‌ అంటే… బీజేపీ నిర్ణయం తేల్చుకోవాలని లోకేష్‌ అన్నారు. బీజేపీకి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చాయి టీడీపీ, జనసేన పార్టీలు. టాప్‌ టు బాటమ్‌ లీడర్స్ మాత్రం ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షులు నడ్డాపై భారం వేశారు.

టీడీపీతో జనసేన పొత్తుపై ఇన్నాళ్లూ పవన్ ఒక్కరే ప్రకటించేవారని, ఇప్పుడు టీడీపీతో కలిసి ప్రకటించారు తప్ప పెద్దగా ఆశ్చర్యం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. ప్యాకేజీ రాజకీయాలనే పవన్‌ నమ్ముకున్నారంటూ పార్టీ కూడా ట్వీట్ చేసింది. యుద్ధమే అని టీడీపీ-జనసేన ప్రకటిస్తే.. చూసుకుందాం 6 నెలల్లో మీ అందరినీ తరిమికొడతామంటూ వైసీపీ కూడా ప్రతిసవాల్‌ విసిరి కదనరంగంలో దిగింది. మరి ఇందులో బీజేపీ ఏ పక్షం నిలబడుతుందో?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Published on: Sep 14, 2023 07:05 PM