Jagannath Rath Yatra 2023: జగన్నాథ రథచక్రాల్ వచ్చేశాయ్.. ఊరేగింపు లైవ్ ఇక్కడ చూడండి
వచ్చేశాయ్.. వచ్చేశాయ్.. జగన్నాథ రథచక్రాల్.. వచ్చేశాయ్.. వచ్చేశాయ్.. ఇసుకేస్తే రాలనంతా జనం.. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనం మధ్య బలభద్రుడు, సుభద్రలు వెంట రాగా.. పూరీ పుర వీధులపై ఊరేగుతున్నాడు జగన్నాథుడు..
స్వామివారి రథాన్ని చూసిన భాగ్యం.. తాకిన ధన్యం.. అందుకే భక్తకోటి పురవీధుల్లోకి వేంచేసి స్వామివారికి స్వాగతం పలుకుతుంటారు. దేవదేవుల రథాలను లాగడానికి భక్తజనులు పోటీ పడుతుంటారు. దాదాపు పదిహేను లక్షల మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య.. జగన్నాథుడి వైభవం చూడతరమా.. స్వామివారి ఆలయం దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా మందిరం వరకు ప్రతి ఏటా ఈ రథోత్సవం ఉంటుంది. కానీ మూడు కిలోమీటర్లలో జనాలు కిక్కిరిసిపోతారు.
గుండీచా మందిరం చేరుకున్నాక.. రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయాన్నే మేళతాళాలతో లోపలికి తీస్కెళ్తారు. అక్కడే స్వామి వారు ఏడు రోజుల పాటు ఉంటారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగుముఖం పడతారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ మర్నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతులిస్తారు. ద్వాదశి నాడు తిరిగి విగ్రహాలను ర్నతసింహాసనంపై ప్రతిష్టించడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ ఆలయం తిరిగి కళకళలాడటం మొదలవుతుంది.
సాక్షాత్తూ భగవంతుడే తన మందిరం వీడి.. పురవీధుల్లోని అందరినీ పలకరిస్తూ పులకరించే ఉత్సవ వేళ.. పూరీలో వైకుంఠమే దిగివచ్చిన అనుభూతి.
భక్తుల మోదమే తప్ప తనకు ఎలాంటి భేదమూ తెలియదని.. వైకుంఠనాధుడే వినయంగా విన్నవించుకునే విడ్డూరమిది.
ఆడినా.. పాడినా.. కలిసినా.. కలహించినా.. అన్నీ ఆ జగన్నాధునితోటే. ఇక్కడ వేదనలుంటాయి. వేదనలకు తోడు నివేదనలూ ఉంటాయి. అన్నింటినీ సాంత్వన పరిచే జగన్నాథ తత్వమూ ఉంటుంది. ఇంత అబ్బుర పరిచే రథోత్సవ విన్యాసాలు.. బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు.
పూరీలో రథయాత్రే కాదు.. ఆలయంలోనూ అడుగడుగునూ విశిష్టతలే.. పూరీ దేవాలయంలో మూల విరాట్ నుండి ప్రసాదం వరకు అంతా విశిష్టమే. దేవాలయాల్లో ఎక్కడ చూసినా మూలవిరాట్ విగ్రహాలు రాతితో ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు పంచలోహములతో తయారుచేస్తారు. కానీ ఈ విశిష్ట దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడతాయి. అదే విగ్రహాలు ఉత్సవమూర్తులుగా ఊరేగింపబడతాయి. ప్రసాదంగా ఇచ్చే అన్నం, పప్పు మొదలైనవి కుండల్లోనే వండుతారు. ఇతర దేవాలయాల్లో మాదిరిగా స్వామి తన దేవేరులతో కాకుండా.. సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు.