మారనున్న EPFO రూల్స్‌..కోటి మందికి ప్రయోజనం

Updated on: Oct 31, 2025 | 2:57 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఉద్యోగులకు ఈపీఎఫ్‌, ఈపీఎస్‌ వర్తించాలంటే వారి మినిమం శాలరీ రూ.25,000లకు పెంచే యోచనలో ఉంది. ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతమున్న రూ.15,000 నెలవారీ వేతన పరిమితిని రూ.25,000కు పెంచే ప్రతిపాదనను రాబోయే కొన్ని నెలల్లో ఆమోదించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రాథమిక వేతనం నెలకు రూ.15,000 లోపు ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్, ఈపీఎస్ పథకాల పరిధిలోకి వస్తారు. అంతకంటే ఎక్కువ జీతం ఉన్నవారు ఈ పథకాల నుంచి వైదొలగే అవకాశం ఉంది. యజమానులు కూడా వారిని ఈ పథకాలలో చేర్చాలనే చట్టపరమైన రూలు కూడా లేదు. ఈ క్రమంలో మరింతమంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని భావిస్తున్న ప్రభుత్వం అయితే, ఈ వేతన పరిమితిని రూ.25,000కు పెంచాలని యోచిస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, వేతన పరిమితిని రూ.10,000 పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా అదనంగా కోటి మందికి పైగా ఉద్యోగులు సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో తక్కువ, మధ్యస్థాయి నైపుణ్యాలున్న కార్మికుల జీతాలు నెలకు రూ.15,000 దాటుతున్నాయి. దీంతో వారు ఈపీఎఫ్ ప్రయోజనాలకు దూరమవుతున్నారు. ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి అని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదనపై నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రస్తుత వేతన స్థాయులకు అనుగుణంగా పరిమితిని పెంచడం సరైన చర్య అని, ఇది ఎక్కువ మంది కార్మికులకు దీర్ఘకాలిక ఆర్థిక రక్షణ కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ మార్పు వల్ల సంస్థలపై చట్టపరమైన ఖర్చులు, సమ్మతి భారం పెరుగుతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, వారు తప్పనిసరి మినహాయింపుల కంటే చేతికి ఎక్కువ జీతం రావాలని కోరుకుంటారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూసుకెళ్తున్న యూపీఐ.. రూ.143 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు

బట్టతలకు బై బై.. ఇక 20 రోజుల్లోనే సహజంగా జుట్టు..!

పంటపొలాల్లో చిరుత.. వణికిపోతున్న రైతులు

బాలికపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత..

రూ.240 కోట్ల లాటరీ గెలిచాడు.. ట్యాక్స్‌ లేకుండా మొత్తం అకౌంట్‌లోకి.. వర్కౌట్‌ అయిన అమ్మ సెంటిమెంట్‌