రిలయన్స్ బిగ్‌ ప్లాన్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు..? వీడియో

రిలయన్స్ బిగ్‌ ప్లాన్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు..? వీడియో

Samatha J

|

Updated on: Jan 25, 2025 | 1:36 PM

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అంబానీ స్వగ్రామమైన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఎన్‌ విడియా నుంచి అధునాతన ఏఐ చిప్‌లను కొనుగోలు చేస్తారు. ఈ డేటా సెంటర్‌ మూడు గిగావాట్స్‌ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్‌ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌.. ఏఐ సేవల కోసం డేటా సెంటర్‌ సామర్థ్యాలను విస్తరించాలని చూస్తున్నాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఓపెన్‌ ఏఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌, ఒరాకిల్‌ సంయుక్తంగా ఓ భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

 స్టార్‌గేట్‌ ప్రాజెక్ట్‌ కోసం 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను కూడా ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని అంబానీ చూస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని నిర్మాణ పనులు అనుకున్నట్టుగా ముందుకు సాగితే ప్రస్తుతం ఈ విభాగంలో భారత్‌ సామర్థ్యాలు పెరుగుతాయి. దేశంలో మొత్తం సామర్థ్యం గిగావాట్‌ కంటే తక్కువే ఉంది. కొత్త ప్రాజెక్ట్‌తో ఇది మూడింతలు పెరగవచ్చు. ఇది దేశానికి కచ్చితంగా గేమ్ ఛేంజర్ అవుతుంది. భారత్‌లో ఏఐ కంప్యూటింగ్‌ మౌలిక వసతులతో పాటు ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌విడియా గతేడాది అక్టోబర్‌లో చర్చలు జరిపాయి. ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశాయి. భారత్‌లో ప్రతీ ఒక్కరికీ ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని అంబానీ తెలిపారు. ఇప్పటికే రిలయన్స్‌ చమురు శుద్ధి, పెట్రోకెమికల్‌ కార్యకలాపాలకు వేదికగా ఉన్న జామ్‌నగర్‌.. ఇప్పుడు పునరుత్పాదక ఇంధనం, ఏఐ రంగంలో కీలక పాత్ర పోషించనుంది.