
2010 ఆగస్టు 14న చైనా రాజధాని బీజింగ్‌కు సమీపంలోని చైనా నేషనల్ హైవే 110, బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ నరకయాతన ప్రారంభమైంది. నెమ్మదిగా మొదలైన రద్దీ.. చూస్తుండగానే పక్క రాష్ట్రాల సరిహద్దుల వరకు విస్తరించింది. దాదాపు 100 కిలోమీటర్ల మేర వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ఒకానొక దశలో వాహనాలు రోజుకు కేవలం 1 కిలోమీటరు లేదా అంతకంటే తక్కువ దూరం మాత్రమే ముందుకు కదలగలిగాయి. కొన్ని గంటల పాటు చక్రం అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఇన్నర్ మంగోలియా ప్రాంతం నుంచి బీజింగ్‌కు బొగ్గు, ఇతర ముడి ఖనిజాలను తరలించే భారీ ట్రక్కుల రద్దీ విపరీతంగా పెరిగింది. చట్టవిరుద్ధంగా నడిచే అదనపు లోడ్ ట్రక్కులు కూడా ఈ రహదారిపైకి భారీగా చేరుకున్నాయి. అదే సమయంలో ఆ ఎక్స్‌ప్రెస్‌వేపై మరమ్మతు, విస్తరణ పనులు ప్రారంభించారు. రోడ్డు సామర్థ్యం సగానికి తగ్గడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఎండ తీవ్రత, గంటల తరబడి ఇంజిన్లు ఆన్ చేసి ఉంచడంతో వందలాది భారీ వాహనాలు మధ్యలోనే పాడైపోయాయి. ప్రమాదాలు కూడా జరగడంతో రహదారి పూర్తిగా మూసుకుపోయింది.
ఈ 12 రోజులు ప్రయాణికులు, డ్రైవర్లకు పీడకలగా మారాయి. రాత్రింబగళ్లు వాహనాల క్యాబిన్లలోనే గడపాల్సి వచ్చింది. సమయం గడవక డ్రైవర్లు రోడ్లపై కూర్చుని పేకాట, బోర్డ్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టారు. ఈ విపత్తును స్థానిక గ్రామస్తులు వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. రోడ్డు పక్కన చిరుతిళ్ళు, నీళ్లు, నూడుల్స్ అమ్మే తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. ప్రయాణికుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని విపరీతమైన ధరలు వసూలు చేశారు. సాధారణంగా 1 యువాన్ పలికే వాటర్ బాటిల్‌ను 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ధరకు, 3 యువాన్ల ఇన్‌స్టంట్ నూడుల్స్ కప్పును 16 యువాన్లకు విక్రయించారు. కొనకపోతే బెదిరింపులకు దిగేవారని బాధితులు వాపోయారు.
పరిస్థితి చేయిదాటిపోవడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం దాదాపు 400 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులను రంగంలోకి దించింది.
సప్లై చైన్ పూర్తిగా స్తంభించిపోవడంతో పరిశ్రమలకు ముడిసరుకు నిలిచిపోయింది. దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు సుమారు 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ. 1,000 కోట్లకు పైగా) మేర ప్రత్యక్ష, పరోక్ష నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఆ తర్వాత చైనా తన హైవే మౌలిక సదుపాయాలు, బొగ్గు రవాణా కోసం ప్రత్యేక రైల్వే కారిడార్లను వేగవంతం చేయడానికి ఈ ఘటనే ప్రధాన కారణమైంది.