AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకేసారి నాగుపాము, రక్తపింజర కాటు వేస్తే ఏమవుతుంది..? ఒళ్లు గగుర్పొడిచే నిజాలు ఇవే..

సాధారణంగా ఏదైనా ఒక విషసర్పం కాటు వేస్తేనే.. ప్రాణాలతో బయటపడటం దేవుడి దయ అనుకోవాలి. అలాంటిది ఒకేసారి రెండు వేర్వేరు జాతులకు చెందిన అత్యంత భయంకరమైన పాములు కాటు వేస్తే ఏం జరుగుతుంది? రెండు భయంకరమైన విషాలు శరీరంలోకి చేరితే ఏం జరుగుతుంది? నిపుణులు చెబుతున్న ఆ షాకింగ్ నిజాలు ఏంటో తెలుసుకుందాం..

ఒకేసారి నాగుపాము, రక్తపింజర కాటు వేస్తే ఏమవుతుంది..? ఒళ్లు గగుర్పొడిచే నిజాలు ఇవే..
What Happens If Two Snakes Bite At Once
Krishna S
|

Updated on: May 18, 2026 | 7:58 AM

Share

వేసవి వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు మనుషులే కాదు, మూగజీవాలు కూడా విలవిలలాడిపోతాయి. ముఖ్యంగా భూగర్భంలో ఉండే పాములు చల్లదనం కోసం, నీటి కోసం జనావాస ప్రాంతాలకు రావడం ఈ సీజన్‌లో సర్వసాధారణం. ఇంటి చుట్టూ దట్టమైన పచ్చదనం, నీటి వనరులు ఉంటే పాముల ప్రమాదం మరింత పెరుగుతుంది. సాధారణంగా ఏదైనా ఒక విషసర్పం కాటు వేస్తేనే ప్రాణాలు దక్కడం గగనమైపోతుంది. అలాంటిది.. ఒకేసారి రెండు వేర్వేరు జాతులకు చెందిన అత్యంత ప్రమాదకరమైన పాములు కాటు వేస్తే పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ?. అయితే ఇటీవల తెలంగాణలో ఇటువంటి ఘటనే జరిగింది. జనగామ జిల్లాలో చిన్నారిని నాగుపాము, రక్తపింజర కాటువేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఒకేసారి రెండు పాములు కాటు వేస్తే శరీరంలో ఏం జరుగుతుందో నిపుణులు వివరించారు.

శరీరంలో శ్వాస వ్యవస్థను నిలిపివేసే నాగుపాము

మన దేశంలోని విషపూరిత పాములలో విభిన్న రకాల విషాలు ఉంటాయి. నాగుపాము కాటు వేసినప్పుడు దాని కోరల నుండి న్యూరోటాక్సిన్ అనే పవర్‌ఫుల్ విషం శరీరంలోకి చేరుతుంది. ఇది నేరుగా మానవ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. మెదడు నుండి శరీర భాగాలకు వెళ్లే సంకేతాలను ఇది పూర్తిగా నిలిపివేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల కండరాలు క్షణాల్లో స్తంభించిపోతాయి. ఫలితంగా ఊపిరాడక బాధితుడు చనిపోతాడు.

రక్తాన్ని విషపూరితం చేసే రక్తపింజర

మరోవైపు రక్తపింజర కాటు వేసినప్పుడు శరీరంలోకి హెమటోటాక్సిన్ అనే విషం ప్రవేశిస్తుంది. ఇది రక్తంపై ప్రభావం చూపుతుంది. రక్తం గడ్డకట్టే సహజ గుణాన్ని ఇది పూర్తిగా నాశనం చేస్తుంది.. లేదా అసాధారణంగా రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గత అవయవాలలో రక్తస్రావం మొదలవుతుంది. కణజాలాలు నశిస్తాయి. చివరికి కిడ్నీలు, గుండె వంటి కీలక అవయవాలు ఫెయిల్ అయిపోతాయి.

రెండు పాములు ఒకేసారి కాటు వేస్తే ఏం జరుగుతుంది?

సాధారణంగా ఒక పాము కాటు వేస్తేనే విషం శరీరంలోకి పాకడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఒకేసారి రెండు రకాల విషాలు శరీరంలోకి వెళ్తే ఊహించని రీతిలో నొప్పి వస్తుంది. ఒకవైపు శ్వాస వ్యవస్థ స్తంభించిపోతుంటే, మరోవైపు రక్తం విషపూరితమై అంతర్గత అవయవాలు కుప్పకూలిపోతాయి. రెండు వేర్వేరు విషాల కలయిక వల్ల శరీరం అంతటా విషం వ్యాపించే వేగం వంద రెట్లు పెరుగుతుంది. దీనివల్ల బాధితుడు కోలుకోవడానికి లేదా ప్రాణాలతో బయటపడటానికి సమయమే దొరకదు.

వైద్యులకు సవాల్‌.. ఇలాంటి స్థితిలో చికిత్స ఎలా చేస్తారు?

ఇలాంటి అరుదైన కేసుల్లో ఏ పాము కాటు వేసిందో తెలియనప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ పాములు కాటు వేసినప్పుడు డాక్టర్లకు చికిత్స చేయడం పెద్ద సవాల్‌గా మారుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు పాలీవాలెంట్ యాంటీ-వెనమ్ అనే బహుళ విష నిరోధక మందును ఉపయోగిస్తారు. మన దేశంలో అత్యధిక మరణాలకు కారణమయ్యే నాలుగు ప్రధాన విషసర్పాల విషాన్ని విరిచేసే శక్తి ఈ ఒక్క యాంటీ వెనమ్‌కు ఉంటుంది.

పాము కాటు వేసినప్పుడు మంత్రాలు, నాటు వైద్యాల జోలికి వెళ్లి సమయాన్ని వృధా చేయకూడదు. శరీరంలోకి చేరిన విషం మోతాదును బట్టి మరణం ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాధితుడిని ఎంత త్వరగా.. అంటే గోల్డెన్ అవర్ లోపు ప్రభుత్వ ఆసుపత్రికి చేరిస్తే ప్రాణాలు దక్కే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us