కొత్త జీవితంలోకి శుత్రి.. తొమ్మిది మంది కుటుంబసభ్యులు.. కాబోయే భర్త దూరం!
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిన్నటి వరకు మనతో ఉన్నవాళ్లు.. ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఆ బాధను భరించడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. అలాంటిది విపత్తులో కుటుంబంలోని తొమ్మిది మందిని కోల్పోవడం.. కళ్లముందే పెరిగిన ఇల్లు నేలమట్టం కావడం.. ఆ బాధ నుంచి తేరుకోకముందే జీవిత భాగస్వామి కావాల్సిన వ్యక్తిని కూడా ప్రమాదంలో పోగొట్టుకోవడం.. ఇవన్నీ ఎదుర్కొంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేరళకు చెందిన శ్రుతి జీవితం ఇలాంటి వరుస విషాదాలకు సాక్ష్యంగా నిలిచింది.

2024లో వయనాడ్‌లో సంభవించిన కొండచరియల విపత్తులో తల్లిదండ్రులు, సోదరి సహా కుటుంబంలోని తొమ్మిది మందిని కోల్పోయిన శ్రుతి గుర్తుందా? ఆ తర్వాత కాబోయే భర్త జెన్సన్ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇన్ని కష్టాలు ఎదురైనా జీవితం మీద ఆశను వదులుకోలేదు. తాజాగా సందీప్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. నవంబర్ 7న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఆమె కథ ఇప్పుడు కేరళలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఒక్క రాత్రిలో అంతా కోల్పోయింది.. వయనాడ్ విషాదం!
2024 జూలై 30.. కేరళలోని వయనాడ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. భారీ వర్షాలకు ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. చూస్తుండగానే ఇళ్లు, రహదారులు, గ్రామాలు బురద, మట్టి కుప్పల కింద కూరుకుపోయాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
ఈ ప్రకృతి విపత్తు శ్రుతి జీవితాన్నీ పూర్తిగా మార్చేసింది. ఆమె తల్లిదండ్రులు, సోదరి సహా కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబంతో కలిసి జీవించిన ఇల్లు కూడా కొండచరియల ధాటికి ధ్వంసమైంది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరినీ, సొంత ఇంటిని కోల్పోయిన ఆమెకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది. కళ్లముందు ఉండాల్సిన వాళ్లంతా శాశ్వతంగా దూరమయ్యారు. తిరిగి వెళ్లడానికి సొంత ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ బతుకుపై ఆశను కోల్పోకుండా ముందుకు సాగేందుకు ప్రయత్నించింది.
కాబోయే భర్త మృతి!
కుటుంబాన్ని కోల్పోయిన బాధ నుంచి శ్రుతి ఇంకా బయటపడలేదు. అలాంటి సమయంలోనే ఆమె జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆమెకు కాబోయే భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదంలో శ్రుతి కూడా గాయపడింది. జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న వ్యక్తి కూడా దూరమయ్యాడు. ఒకవైపు కుటుంబాన్ని కోల్పోయిన బాధ.. మరోవైపు జెన్సన్ మరణం.. ఈ వరుస ఘటనలు శ్రుతిని తీవ్రంగా కుంగదీశాయి. ఈ రెండు విషాదాల గురించి తెలుసుకున్న కేరళ ప్రజలు ఆమెకు అండగా నిలిచారు. ఆమె జీవితంలో ఎదురైన కష్టాలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి.
కష్టకాలంలో ప్రభుత్వ అండ.. రెవెన్యూ శాఖలో ఉద్యోగం!
ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న శ్రుతికి కేరళ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర రెవెన్యూ శాఖలో క్లర్క్‌గా ఉద్యోగం కల్పించింది. దీంతో ఆమెకు ఆర్థిక భరోసాతో పాటు జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు ఓ మార్గం లభించింది. ప్రస్తుతం శ్రుతి రెవెన్యూ శాఖలో పనిచేస్తోంది. తన బాధలను అధిగమిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె జీవితంలో మరో కొత్త వ్యక్తి పరిచయమయ్యారు. ఆయనే సందీప్.
అన్ని విషయాలు తెలిసి అంగీకరించాడు!
శ్రుతి జీవితంలో ఎదురైన విషాదాల గురించి పూర్తిగా తెలిసిన సందీప్ ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు. మానంతవాడికి చెందిన సందీప్ కూడా ప్రభుత్వ ఉద్యోగే. వయనాడ్ కలెక్టరేట్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో నవంబర్ 7న కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వివాహ వేడుక జరిగింది. పెళ్లికి శ్రుతి బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గతంలో ఎన్నో విషాదాలను చూసిన ఆమె జీవితంలో ఈ వేడుక కొత్త ఆశలను నింపింది.
పెళ్లి అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రుతి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన జీవితంలో జరిగిన ప్రతిదీ తెలిసినప్పటికీ సందీప్ తనను అంగీకరించి పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారని తెలిపింది. ‘నా జీవితంలో జరిగిన ప్రతిదీ ఆయనకు తెలుసు.మేమిద్దరం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని శ్రుతి చెప్పింది. తనకు కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
శ్రుతి పెళ్లికి మాజీ మంత్రి కే. రాజన్
ఈ వివాహ వేడుకకు సీపీఐ ఎమ్మెల్యే, కేరళ మాజీ మంత్రి కే. రాజన్ హాజరయ్యారు. వయనాడ్ కొండచరియల విపత్తు తర్వాత బాధితుల పునరావాస కార్యక్రమాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో శ్రుతికి సహాయం అందించేందుకు ఆయన చొరవ చూపారు. శ్రుతి జీవితంలో ఇదొక సంతోషకరమైన సందర్భమని అన్నారు. కష్టకాలంలో ఆమెకు అండగా నిలిచామని, ఇప్పుడు ఆమె జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న సమయంలో ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఒకే విపత్తులో కుటుంబంలోని తొమ్మిది మందిని కోల్పోయింది.. ఆ తర్వాత కాబోయే భర్తను కూడా దూరం చేసుకుంది. అయినా జీవితం అక్కడితో ముగిసిపోకూడదని ధైర్యంగా ముందడుగు వేసింది. ఇప్పుడు సందీప్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. శ్రుతి ప్రయాణం విషాదంతో మొదలైనా.. ఇప్పుడు ఆశతో మరో మలుపు తిరిగింది. ఆమె కొత్త జీవితానికి పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.