‘వై షుడ్ ఓన్లీ మనుషులు హావ్ ఫన్‘.. ఈ డైలాగ్ కాస్త మార్చాం లెండి. మనుషులే కాదు.. మాక్కూడా ఫన్ ఉండాలనుకుంది ఓ భారీ పాము. సరిగ్గా కొత్త బైక్ హెడ్‌లైట్ బాక్స్‌లో దూరి దాక్కుంది. ఇక బైక్ నడిపే యజమాని అది చూసి దెబ్బకు దడుసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మయూర్‌భంజ్ జిల్లా ఒరచందబిల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎంతగానో ఇష్టపడి కొత్త బైక్ కొనుగోలు చేశాడు. ఉత్సాహంగా దానిపై తన ఇంటికి రయ్.. రయ్ మంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో అతడికి దడపుట్టించేలా వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ముందుగా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి అంతకంతకూ పెరుగుతూపోతుండటంతో.. ఎక్కడ నుంచి వస్తున్నాయో గమనించాడు. బైక్ హెడ్‌లైట్ బాక్స్ నుంచి ఏదో కదులుతున్నట్లు కనిపించింది. బైక్ ఆపి చూడగా.. అది ఏకంగా నాలుగు అడుగుల పాము.. అంతే! దెబ్బకు అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్‌కు చెప్పాడు. అతడు ఆ భారీ త్రాచుపామును రెండు గంటలు శ్రమించి పట్టి బంధించాడు. చివరికి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.