
ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులులోని సైంజ్ వ్యాలీలో క్లౌడ్‌బరస్ట్ అయింది. ప్రమాదకర స్థాయిలో పార్వతి నది ప్రవహిస్తుంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఆట్-లహ్రి-సైంజ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నదిలో కార్లు, ట్రక్కులు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల కారణంగా ఐదుగురు మృతి చెందారు. వరదల్లో మరో 20 మంది గల్లంతయ్యారు. 250 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. NDRF, SDRF సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలపై సీఎం సుఖ్వీందర్‌సింగ్ సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
అటు గుజరాత్‌ను భారీవరదలు ముంచెత్తాయి. మూడ్రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. రాబోయే రెండ్రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా సూరత్ జిల్లాలో భారీ వర్షాలు పడటంతో రహదారులు నీటమునిగిపోయాయి. ఎక్కడ చూసిన నీరు మునిగిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.