AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మంచు పర్వతాలు పేకమేడల్లా కూలడం చూశారా..? కింద ఉన్న గ్రామానికి గ్రామమే కనుమరుగు!

స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఘోర విపత్తు సంభవించింది. బిర్చ్ గ్లేసియర్ హిమనీనదం కుప్పకూలి ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది. హిమనీనదం కుప్పకూలడంతో ఎంతో అందమైన బ్లాటెన్ ఆల్పైన్ గ్రామం 90 శాతం వరకు మంచు, మట్టి, రాళ్లతో కూరుకుపోయింది. మే 28న జరిగిన ఈ విపత్తుకు...

Viral Video: మంచు పర్వతాలు పేకమేడల్లా కూలడం చూశారా..? కింద ఉన్న గ్రామానికి గ్రామమే కనుమరుగు!
Glacier Collapsed
K Sammaiah
|

Updated on: May 30, 2025 | 2:45 PM

Share

కొండ చరియలు విరిగి పడటం.. రాకపోకలకు అంతరాయం ఏర్పడటం చూశాం. కానీ, స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఘోర విపత్తు సంభవించింది. బిర్చ్ గ్లేసియర్ హిమనీనదం కుప్పకూలి ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది. హిమనీనదం కుప్పకూలడంతో ఎంతో అందమైన బ్లాటెన్ ఆల్పైన్ గ్రామం 90 శాతం వరకు మంచు, మట్టి, రాళ్లతో కూరుకుపోయింది.

మే 28న జరిగిన ఈ విపత్తుకు ముందు 19వ తేదీన భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని 300 మంది నివాసితులు, పశువులను ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టాన్ని భారీగా నివారించగలిగారు. కానీ, 64 ఏళ్ల వృద్ధుడు కొండచరియల కింద చిక్కుకుని గల్లంతయ్యాడు. రక్షణ బృందాలు డ్రోన్లు, జాగిలాలతో గాలింపు చేపట్టారు. అయితే, శిథిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.

కేవలం 40 సెకన్ల వ్యవధిలోనే హిమానీనదం కూలిపోవడంతో ఒకప్పటి అందమైన గ్రామం శిథిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు. వాలైస్ ప్రాంతంలోని లాట్‌షెంటల్ లోయలో ఉన్న బ్లాటెన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లోంజా నదికి అడ్డుకట్ట పడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్, కిప్పెల్ మునిసిపాలిటీలలోని భవనాలను కూడా ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి. ఇది పర్మాఫ్రాస్ట్ కరుగుదలతో పాటు, పర్వతాల శిలల అస్థిరతను పెంచుతోంది. బ్లాటెన్ గ్రామం మునుపటి అందాన్ని కోల్పోయినప్పటికీ, గ్రామస్థులు తమ మనోబలాన్ని కోల్పోలేదు.

గ్రామాధిపతి మాథియాస్ బెల్‌వాల్డ్ మాట్లాడుతూ తాము తమ గ్రామాన్ని కోల్పోయామే కానీ,మనసును కాదని, తామంతా ఒకరినొకరం ఆదుకుంటూ తిరిగి తమ గ్రామాన్ని నిర్మించుకుంటామని అన్నారు. ఈ విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తు చేస్తోందని, ఇది భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు.

వీడియో చూడండి: