మాతృ దేవో భవ.. పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ , అతిథి దేవో భవ అని ఆర్యోక్తి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు.. జీవితానికి వెలుగునిచ్చే గురువుని మాత్రమే కాదు ఇంటికి వచ్చే అతిధిని కూడా దైవం కూడా భావిస్తారు. అంటే అతిథి భగవంతునితో సమానం అని భావించి గౌరవిస్తారు. ఇదే సంప్రదాయాన్ని తరతరాల నుంచి పాటిస్తున్నారు కూడా.. అతిథి దేవో భవ’ అనే సూత్రం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. దీనినే భారతదేశంలో పర్యాటక రంగంలో కూడా ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఎవరైనా విదేశీయులు మన దేశంలో పర్యటించడానికి వస్తే.. భారత భూమి మీద అడుగు పెట్టింది మొదలు.. తిరిగి వెళ్ళే వరకూ దైవంగా భావించి గౌరవిస్తారు. అన్ని విధాలా సహాయ సహకారాన్ని అందిస్తూ ఆ విదేశీయుడు తన దేశానికి మంచి జ్ఞాపకాలతో వెళ్ళేలా చేస్తారు. అయితే కొన్నిసార్లు కొంతమంది పర్యాటకులు తులసి వనంలో గంజాయి మొక్కలా కొంతమంది స్వార్ధపరుల దుష్ప్రవర్తనను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి వ్యక్తుల వలన భారాతీయులకు ఉన్న మంచి పేరు దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది. విదేశీయులను మోసం చేసిన ఘటనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
తాజాగా ఢిల్లీకి చెందిన ఓ రిక్షా కార్మికుడు విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయిలను మోసం చేసిన ఉదంతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన జామా మసీదు నుంచి ఎర్రకోటకు ప్రయాణానికి సంబంధించినది. ఈ ఘటనను విదేశీ యువతులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను సింగపూర్ ట్రావెల్ వ్లాగర్ సిల్వియా చాన్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఢిల్లీలో ప్రయాణిస్తున్న తనను రిక్షా పుల్లర్ ఎలా మోసం చేశాడో తన వీడియోలో చెప్పింది. రిక్షా పుల్లర్ తమని జామా మసీదు నుంచి ఎర్రకోటకు తీసుకుని వెళ్ళడానికి 100 రూపాయలు తీసుకుంటానని చెప్పాడు. తాము ఆ రిక్షాలో ఎక్కి ఎర్రకోటకు వచ్చిన అనంతరం మాట మార్చి 6000 రూపాయలు డిమాండ్ చేయడం ప్రారంభించినట్లు వెల్లడించారు ఆ యువతులు.
ఇష్టం లేకపోయినా రిక్షా పుల్లర్‌కు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని సిల్వియా చెప్పింది. అంతేకాదు ఎవరైనా సరే ఇలాంటి మోసానికి గురి కాకుండా ఉండాలంటే.. ఉబెర్ వంటి సేవలను తీసుకోవాలని.. వాటికి ప్రాధాన్యత ఇవ్వడం సురక్షితమని ఆమె పేర్కొంది.
ఆ వీడియో చూసి భారతీయులకు కోపం వచ్చింది
జూలై 26న చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. చాలా మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు. భారతీయులమైనందున మేము అలాంటి వ్యక్తుల ప్రవర్తనకు తాము క్షమాపణలు చెబుతున్నామని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ల వల్లే భారతదేశానికి చెడ్డపేరు వస్తుంది.. అయితే నన్ను నమ్మండి, అందరూ అలా ఉండరు. అతిథులను మేము దేవుడిలా చూస్తాం. అదే సమయంలో, మరొకరు మీకు జరిగిన దానికి మేము సిగ్గుపడుతున్నామని తమ భావాలను.. జరిగిన సంఘటన పట్ల తమ నిరసనను తెలియజేస్తున్నారు.
సింగపూర్ నుంచి ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఇద్దరు యువతలు ఎదుర్కొన్న ఈ పరిస్థితి దారుణం అని అది సిగ్గుచేటని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా ఘటనలు పర్యాటకులకు అసౌకర్యంగా ఉండటమే కాదు.. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చస్తున్నారు. ఇటువంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ తలెత్తకుండా పరిష్కరించి పర్యాటక అనుభవాన్ని మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..