- Telugu News Trending Viral Photo: Baby strapped to her, single mom drives e rickshaw for a living in Noida
Viral Photo: ఇదికదా అమ్మ ప్రేమ.. కట్టుకున్నవాడు మోసం చేస్తే.. పసివాడిని గుండెలపై మోస్తూ..ఆటో నడుపుతున్న మహిళ
Mother Love Viral Photo: జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ప్రమాణం చేసి మూడు ముళ్లు వేసిన భర్త ప్రమాణాలు గాలికొదిలేసి.. కుటుంబాన్ని రోడ్డున పడేసి మధ్యలోనే మడమ తిప్పాడు. దాంతో లోకం తెలియని పసివాడితో ఒంటరిగా రోధించని ఆ అబల సబలగా మారింది. ఏడాది చిన్నారితో జీవన పోరాటం సాగిస్తోంది.
Updated on: Sep 25, 2022 | 5:34 PM

చంచల్ శర్మ మూడేళ్ల క్రితం 2019లో దాద్రీలోని ఛయాన్సా గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత నుంచి భర్త ఎప్పుడూ చంచల్ శర్మని చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నాడు. దీంతో ఆ వేధింపులను తట్టుకోలేక పుట్టింటికి చేరుకుంది. తండ్రి లేని తన ఫ్యామిలీ ఆర్ధిక స్థితి గురించి చంచల్ శర్మకు తెలుసు.జీవిత సత్యాన్ని గ్రహించింది. తనకు తాను ధైర్యం చెప్పుకుంది.

27 ఏళ్ల చంచల్ శర్మ వృద్ధురాలైన తల్లి, మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఫ్యామిలీకి భారం కాకూడదు అనుకుంది. ఒంటరి పోరాటం మొదలు పెట్టింది. లోకం, సమాజం ఇవన్నీ పక్కన పెట్టింది. తనకు చేతనైన పనితోనే తన బిడ్డను పోషించుకోవాలనుకుంది.

వెంటనే ఓ రిక్షా అద్దెకు తీసుకుంది. తన చిన్నారి బాబును చున్నీతో కట్టుకుని గుండెలపై బిడ్డను మోస్తూ.. రిక్షాలో ప్రయాణికులను లాక్కెళ్తూ.. తన బ్రతుకు బండిని కొనసాగిస్తుంది.

అవును ఏడాది వయసు ఉన్న కొడుకుని గుండెలకు కట్టుకుని మరీ ఈ రిక్షాని నడుపుతోంది. ఐతే ఒక మహిళ ఇలా డ్రైవింగ్ చేయడాన్ని మొదట్లో స్థానిక ఈ రిక్షా డ్రైవర్లు అడ్డుచెప్పారు. ఆటంకాలు కలిగించారు. అంతేగాదు ఆమెకు ఈ రిక్షా ఇవ్వొద్దు అంటూ గొడవ చేశారు. అయితే చంచల శర్మ ట్రాఫిక్ పోలీసుల సహాయం తీసుకుంది. ఏ1బీ అవుట్ పోస్ట్ సిబ్బంది మద్దతుతో తనకు ఉన్న సమస్యలను అధిగమించింది.

ఉదయం ఆరున్నర గంటలకల్లా సెక్టార్-62 లోని మెట్రో ఎలక్ట్రానిక్ సిటీకి వస్తుంది. అక్కడ రోజుకు 300రూపాయలకి ఆటో రిక్షాను అద్దెకు తీసుకుని నడుపుతోంది. ఇలా రోజుకు 600 నుంచి 700 వరకూ సంపాదిస్తోంది. నిజాయితీగా చేసే ఏపనీ తక్కువ కాదంటూ నిండైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.




