Viral News: ‘చెత్త’ రాజకీయాలంటే ఇదే మరి.. పాపం వీరి సమస్య పరిష్కారమయ్యేదెలా?

|

Jul 08, 2021 | 11:16 AM

గ్రామ పంచాయితీని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తే తమకు మరిన్ని వసతులు లభిస్తాయని స్థానికులు భావించడం సహజమే. అయితే వీరికి మాత్రం తమ గ్రామ పంచాయితీని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.

Viral News: ‘చెత్త’ రాజకీయాలంటే ఇదే మరి.. పాపం వీరి సమస్య పరిష్కారమయ్యేదెలా?
Representative Image
Follow us on

శివారులోని గ్రామ పంచాయితీని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తే పన్నులు పెరిగినా తమకు మరిన్ని వసతులు లభిస్తాయని స్థానికులు భావించడం సహజమే. అయితే వీరికి మాత్రం తమ గ్రామ పంచాయితీని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం కొ(చె)త్త సమస్యను తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే..పూణెకు శివారులోని 23 గ్రామ పంచాయితీను ఇటీవల పూణె మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. వీటిలో కిర్‌కాట్వాడి గ్రామపంచాయితీ కూడా ఒకటి. మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైతే తమ గ్రామ పంచాయితీకి నీటి సరఫరా, పారిశుద్ధ్య వసతులు మరింత మెరుగవుతాయని, రోడ్లు తళతళ మెరిసిపోతాయని స్థానికులు సంతోషంలో మునిగిపోయారు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. గ్రామ పంచాయితీని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో ఇక చెత్తకుప్పలు తీసుకెళ్లడం తమ పనికాదంటూ గ్రామ పంచాయితీ అధికారులు చేతులెత్తేశారు.

అటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యర్థాలకు తరలింపునకు ముందస్తు చర్యలు తీసుకోలేదు. వ్యర్థాల తరలింపునకు చర్యలు తీసుకునేందుకు తమకు మరిన్ని రోజులుకావాలని చెబుతున్నారు. గల్లీ లీడర్ల పంతాలు పట్టింపులకు తోడు వ్యర్థాల తొలగింపునకు అవసరమైన నిధులు లేకపోవడం ఈ పరిస్థితికి కారణంగా తెలస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇటు అపార్ట్‌మెంట్లు, అటు వీధుల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. స్థానికులు రోడ్ల పక్కను వ్యర్థాలు పడేస్తుండటంతో దోమల బెడద కూడా గత కొన్ని రోజులుగా బాగా పెరిగిపోయింది. దీంతో స్థానిక ప్రజలు అంటు వ్యాధుల భయంతో వణికిపోతున్నారు. గత వారం రోజులుగా వ్యర్థాలను తొలగించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తమ అపార్ట్‌మెంట్లలో వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వచ్చే ప్రైవేటు కాంట్రాక్టర్లు..ఒక్కసారిగా సేవలు ఆపేసినట్లు తెలిపారు.

శివారులోని గ్రామ పంచాయితీలను ఒకేసారి పూణె మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గ్రామ పంచాయితీలను విలీనం చేసుకునే..అక్కడ తగిన వసతులు పెంచేందుకు అవసరమైన నిధులను పూణె మున్సిపల్ కార్పొరేషన్ సమకూర్చుకోవాలని సూచించింది. తాము వద్దని వారించినా గ్రామ పంచాయితీలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసి శివసేన-ఎన్సీపీ నేతలు తమ పంతం నెగ్గించుకున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ పంతాల కోసం ముందస్తు చర్యలు తీసుకోకుండా గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడాన్ని తప్పుబడుతున్నారు.

మొత్తానికి ‘చెత్త రాజకీయాలు’ అంటే ఏంటో ఇప్పుడు తమకు బాగా అర్థమయ్యిందంటున్నారు పూణె మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన ఆ గ్రామ పంచాయితీ ప్రజలు. స్థానిక రాజకీయ నేత పంతాలు పట్టింపుల కారణంతోనే తాము ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.

Also Read..

తెలంగాణలో పిడుగుల వర్షం.. ఒక్కరోజే వేరు.. వేరు చోట్ల తొమ్మిది మంది మృతి

ఎక్కువ గంటలు మాస్క్ ధరించడం వలన చర్మ సమస్యలు.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..