అందరికంటే అందంగా, డిఫరెంట్ గా కనిపించాలని కొంతమంది కోరుకుంటారు. తమ అభిరుచిని నెరవేర్చుకోవడానికి ప్రపంచంలో చాలా మంది రకరకాల పద్ధతులను ఎంచుకుంటారు. ప్రజల అభిరుచుల జాబితాలో అందం ముఖ్యంగా చేరిపోయింది. నిజానికి అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించి, తమ రూపురేఖలను పూర్తిగా మార్చుకున్న మహిళలు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. దీంతో తమ పాత రూపాన్ని చూసిన వారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత గుర్తించలేకపోతున్నారు. అందంగా కనిపించడం కోసం ఎన్నోసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నమహిళల్లో ఒక మహిళ మోనికా ఏ అలెన్.. ఇప్పుడు ఈమె ప్లాస్టిక్ సర్జరీ పర్యవసానాన్ని చవిచూడాల్సి వచ్చింది.
కాలిఫోర్నియా నివాసి అయిన మోనికా ఏ అలెన్ మోనిక్ ప్లాస్టిక్ సర్జరీపై మక్కువ పెంచుకుంది. ఇప్పటి వరకు, ఆమె నోరు, ముక్కు, చేతులు, కాళ్ళు , పిరుదుల సహా తన శరీరంలోని వివిధ భాగాలకు దాదాపు 200 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. డైలీ స్టార్ నివేదిక ప్రకారం మోనికా ఏ అలెన్ తన ముక్కుని ఒక సారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 24 సార్లు ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుంది. సోషల్ మీడియాలో ఆమె తన శస్త్రచికిత్స ఫలితాలను.. దాని వల్ల తనకు ఏమి జరిగిందో మొత్తం కథను వివరించింది.
చాలా సర్జరీలు చేయించుకోవడం వలన తన పాదాల వద్ద చర్మం డెడ్ అయిందని మోనికా చెప్పింది. శస్త్రచికిత్స తనని వికలాంగురాలిని చేసిందని.. ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతున్నానని చెప్పింది. అంతేకాదు తన పిరుదులను పెద్దవిగా చేయించుకోవడానికి చాలాసార్లు సిలికాన్ ఇంప్లాంట్లు చేయించుకున్నానని.. అయితే ఆ ఇంప్లాంట్లు క్రమంగా క్రిందికి వెళ్లాయని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు ఆమె తన పెదాలను అందంగా మార్చుకోవడానికి లిప్ ఫిల్లర్ కూడా చేయించుకుంది.. అయితే ఈ శస్త్రచికిత్స కూడా విఫలమై పెదవుల షేప్ మారిపోయాయి.
తన అందాన్ని పెంచుకోవడానికి సర్జరీ చేయించుకున్నానని.. అయితే ఇప్పుడు తన రూపురేఖలు మారిపోయి విదూషకుడిలా తయారయ్యాయని చెప్పింది. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు తనను భయ పడుతూ చూస్తారని చెప్పింది. ఇప్పుడు మోనిక్ తాను చేసిన పనికి చాలా పశ్చాత్తాపపడుతోంది. ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..