Viral: సెల్యూట్.. ఒంటిపై ఉన్న చీరతో వందల మంది ప్రాణాలు కాపాడిన వృద్ధురాలు..

|

Apr 02, 2022 | 4:06 PM

సమయస్ఫూర్తితో వ్యవహరించిన 65 ఏళ్ల వృద్ధురాలు.. వందలాది మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Viral: సెల్యూట్.. ఒంటిపై ఉన్న చీరతో వందల మంది ప్రాణాలు కాపాడిన వృద్ధురాలు..
Red Saree Flag
Follow us on

65 వృద్ధ మహిళ రోజూలానే పొలానికి వెళ్తుంది. ఆమె వెళ్లే బాటలో రైల్వే ట్రాక్ ఉంటుంది. గురువారం అటుగా వెళ్తున్న ఆమెకు రైలు పట్టా విరిగి ఉండటం కనిపించింది. ఈ విషయం ఎవరికైనా చెబుదామంటే ఆమె వద్ద ఫోన్ లేదు. తిరిగి ఊరికి వెళ్లి ఎవరికైనా చెబుదామన్నా.. ఈలోపు ట్రైన్ వస్తే పెను ప్రమాదం సంభవిస్తుంది. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలపోలేదు. ఈలోపే ట్రైన్ కూత వినిపించింది. ఆ భయంలోనే ఆమె మనసులో ఓ ఆలోచన మెదిలింది. తన ఒంటిపై ఉన్న ఎర్ర చీర సాయంతో ట్రైన్‌ను ఆపి.. ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళ్తే… ఉత్తర్​ప్రదేశ్(Uttar Pradesh)​ ఎటా జిల్లా అవాగఢ్​ మండలం గులేరియా గ్రామంలో ఓంవతీ దేవి అనే మహిళ నివాసం ఉంటుంది. గురువారం రైల్వే ట్రాక్ పక్కనుంచి పొలం పనులకు వెళ్తుండగా.. కుస్బా రైల్వే స్టేషన్(Kusba railway station)​ సమీపంలో ఒక పట్టా విరిగి ఉండడాన్ని గమనించింది. రైలు వస్తే ప్రమాదం జరుగుతుందని గ్రహించిన ఆమెకు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. ట్రైన్ వచ్చే వేళ అయ్యిందని భావించిన వృద్ధ మహిళ  సమయస్పూర్తితో వ్యవహరించింది.

అక్కడే ఉన్న చెట్టు కొమ్మలు విరగ్గొట్టి.. పట్టాలకు అడ్డంగా ఎర్ర చీరను కట్టింది. ఇంతలోనే ఎటా నుంచి టుండ్లా వెళ్తున్న పాసింజర్ ట్రైన్ వచ్చింది. పట్టాలకు అడ్డంగా ఎర్రటి వస్త్రం ఉండడాన్ని గమనించిన డ్రైవర్.. అనుమానంతో బ్రేక్ వేశాడు. కిందకి దిగి చూడగా పక్కనే ఓంవతీ దేవి కనిపించింది. ఏం జరిగిందని అడగ్గా.. ఆమె పట్టా విరిగిన విషయాన్ని చెప్పింది.   వెంటనే రైలు డ్రైవర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఓంవతీ దేవి లేకపోతే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అతడు తెలిపాడు. ట్రైన్ డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులు, గ్రామస్థలు ఓంవతీ దేవిని ప్రశంసలతో ముంచెత్తారు.

Also Read: AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో