ఆర్టీసీ బస్సులు, రైళ్లు వంటి ప్రజారవాణా వ్యవస్థల్లో ప్రయాణించేటప్పుడు పొగ తాగరాదు అని రాసి ఉండటం గమనిస్తుంటాం. పొగ తాగడం వలన తొటి ప్రయాణికులకు ఇబ్బందే కాకుండా రక్షణ చర్యలకు విఘాతం కలుగుతుంది. బస్సులో, రైళ్లో పొగ తాగడం వలన అనేక అగ్ని ప్రమాదాలు జరిగిన దుర్ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటిది విమానంలో పొగ తాగాలనే ధైర్యం ఎవరైనా చేస్తారా? కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. సిగరెట్ వెలిగించొద్దన్నందుకు ఏకంగా విమానాన్నే తగలబెట్టేందుకు ట్రై చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్లే విమానంలో ప్రయాణిస్తోన్న ఒక మహిళ, ఫ్లైట్ లోని వాళ్లందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. విమానంలో గందరగోళం సృష్టించింది. తోటి ప్రయాణీకుల్ని, విమాన సిబ్బందిని కొన్ని నిమిషాల పాటు బెంబేలెత్తించింది. మామూలుగా ఎర్రబస్సులోనే సిగరెట్ తాగనివ్వరు. అలాంటిది, విమానంలో ఏకంగా సిగరెట్ వెలిగించి గుప్పుమని పొగ ఊదింది. పొగ బయటకు వదలడంతో పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది ఒక్కసారిగా ఆమె దగ్గరకు చేరుకుని సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే, సిగరెట్ ఇవ్వకపోవడమే కాదు, మరో చేతితో లైటర్ వెలిగించి ఏకంగా విమానాన్నే అంటించే ప్రయత్నం చేసింది.
సీట్ కవర్స్ తగులబెట్టేందుకు ప్రయత్నించగా ఎయిర్ హోస్టెస్ అతికష్టం మీద ఆమెను అడ్డుకున్నారు. అయినా తగ్గని ఆమె, అక్కడున్న నాప్కిన్ అంటించేందుకు ప్రయత్నించింది. అయితే, ఎట్టకేలకు వాటర్ బాటిల్ లోని నీళ్లు పోసి ఆమె లైటర్‌ను ఆర్పివేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యంత కీలకమైన విమాన భద్రతా నియమాలను ధిక్కరిస్తూ, విమానంలో ఆ మహిళ చేసిన నిర్వాకాన్ని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకుండా సదరు మహిళా ప్రయాణీకురాలి నిర్లక్ష్యపు ప్రవర్తనను ఎండగడుతున్నారు. ఒక్కరి పిచ్చి పని విమానంలో ఉన్న అందరి ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
Fatima, on a flight from Istanbul to Cyprus tried to light the plane on fire pic.twitter.com/9fYyTGaAn5
— Frontalforce 🇮🇳 (@FrontalForce) March 23, 2025