
పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి.. అన్నట్టుగా ప్రతీ ఒక్కరికి ఒకే రకంగా అలవాట్లు ఉండవు.. కొందరికి కొన్ని వింత అలవాట్లు కూడా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అక్కడ నివసిస్తున్న ఓ మహిళకు పాడు అలవాటు ఉంది. రోజూ అలా చేయకపోతే.. అసలు సదరు మహిళకు నిద్ర పట్టదట. రోజూ ఆ అలవాటు కోసం రూ. 3 లక్షలపైగా ఖర్చు చేస్తుందట. ఇంతకీ ఆ పాడు అలవాటేంటి.? స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లూసియానాలో నివసిస్తున్న 27 ఏళ్ల డ్రెకా మార్టిన్ అనే మహిళకు చిన్నప్పటి నుంచి ఓ వింత అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి ఆమెకు జాన్సన్ బేబీ పౌడర్ తినకపోతే అస్సలు నిద్రపట్టదట. ఆ పౌడర్ రుచి.. దాని సువాసన మాదిరిగానే ఉంటుందని.. ఇక ఆ సువాసనే తనను పౌడర్ తినేలా చేసిందని మార్టిన్ చెబుతోంది. మొదట్లో ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డానని.. కానీ ఆ తర్వాత అందరికీ తెలిసిపోయిందని పేర్కొంది.
మరోవైపు మార్టిన్ వింత అలవాటు గురించి తెలిసిన కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆమెను అది మానుకోవాలని వారించారు. అటు జాన్సన్ సంస్థ కూడా పౌడర్ తినడానికి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పినా.. మార్టిన్ పట్టించుకోలేదు.. తన అలవాటును అలాగే కొనసాగించింది. తనకు ఈ అలవాటు కారణంగా ఏడాదికి రూ. 3 లక్షలు ఖర్చు అవుతోందని చెప్పింది.
ఇప్పటివరకు పౌడర్ తినడం వల్ల తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదన్న మార్టిన్.. కేవలం ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రమే దాన్ని తినలేదని చెప్పుకొచ్చింది. అయితే డాక్టర్లు.. మార్టిన్ ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతోందని.. దాన్ని ‘పికా’ అనే డిసార్డర్‌గా పిలుస్తారని చెప్పారు. ఈ మానసిక సమస్య ఉన్న వ్యక్తులు చాక్‌పీస్, పెయింట్ లాంటివి తరచూ తింటుంటారని వైద్య నిపుణులు అంటున్నారు.