
viral video: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి ముందు కావాల్సింది ధైర్యం. భయపడితే చిన్న సమస్య కూడా పెద్దగా కనిపిస్తుంది. తాజాగా ఓ మహిళ దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. ధైర్యంగా ఉంటే దేన్నయినా ఎదుర్కోగల శక్తి వస్తుందని నిపుణులు చెప్పే సూచనను ఈ మహిళ అక్షరాలా ఆచరణలో చూపించింది. నెదర్లాండ్స్ లోని ఓ బేకరీలో జరిగిన ఈ ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అవగా.. వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
లతీఫ్ పెకెర్ అనే మహిళ తన కుమారుడి బేకరీలో కౌంటర్ టేబుల్ ను క్లీన్ చేస్తోంది. బేకరీ డోర్ వద్దకు నల్లటి హుడీ షర్ట్ వేసుకుని వచ్చిన అగంతుకుడు గ్లాస్ డోర్ నుంచి బేకరీని పరిశీలించాడు. మహిళ ఒక్కతే ఉండడంతో తన పని సులువే అనుకుని, క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి దూసుకొచ్చాడు. క్యాష్ డెస్క్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయబోయాడు. మొదట అతడి చేతిలో ఆయుధం ఉందనుకుని వెనకడుగు వేసిన ఆ మహిళ.. ధైర్యం చేసి టేబుల్ క్లీన్ చేస్తున్న క్లాత్‌నే ఆయుధంగా చేసుకొని అతడిపై ఎటాక్ చేసింది. అతడు ఆమెను తోసేసేందుకు గట్టిగా ప్రయత్నం చేశాడు. అయినా ఆమె తగ్గలేదు. బలంగా అతడిని ఎదుర్కొంది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈవీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్ఆనరు. క్లీనింగ్ క్లాత్ కు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయొద్దంటున్నారు.