‘ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ’.. ఇది రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలోని పాట చరణం. నిజంగా సమాజంలో కొందరి ప్రతిభ చూస్తే ఇది ముమ్మాటికీ నిజమే అనిపిస్తుంది. ఎలాంటి శిక్షణ లేకుండానే కొందరు అద్భుతాలు చేస్తుంటారు. అయితే ఒకప్పుడు ఇలాంటి ప్రతిభ కేవలం కొందరికీ మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ ప్రతిభావంతులు ఉన్నా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతున్నారు.
ఇలాంటి ఎన్నో వీడియోలకు ప్రతీ రోజూ సోషల్ మీడియా వేదిక అవుతోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా తెలంగాణ స్టేట్ పోలీస్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారంటేనే ఈ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఓ స్కూల్ విద్యార్థి ‘శంకరాభరణం’ మూవీలోని పాటను ఆలపించాడు. ఈ కాలం చిన్నారులకు క్లాసిక్ సాంగ్స్‌పై అంతలా ఆసక్తి ఉండదని సహజంగా భావిస్తుంటాం. కానీ ఈ బుడ్డోడు పాటను ఆలపించిన తీరు మాత్రం అద్భుతంగా ఉంది.
శంకరభరణం సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ‘శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా’ పాటను విద్యార్థి ఆలపించిన విధానానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇక పాట పాడిన కుర్రాడు ఒకెత్తైతే, అక్కడే బెంచీపై కూర్చొని కంపాస్ బాక్స్‌పై దరువు వేసిన కుర్రాడు మరో ఎత్తు. పాటకు అనుగుణంగా మరో కుర్రాడు వేసిన దరువు కూడా సింప్లీ సూపర్బ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మన దేశంలో బాలల/యువ ప్రతిభకు కొదువ లేదు…
తెలుసుకోవాల్సింది మంచి – చెడు అనే దారుల మధ్య సన్నని గీత మాత్రమే! అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి మన దేశం సరికొత్త ఆవిష్కరణలకు నిలయం అవుతుంది. pic.twitter.com/Hlmh5C3Wn7— Telangana State Police (@TelanganaCOPs) February 18, 2024
ఈ వీడియోను షేర్ చేసిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను సైతం రాసుకొచ్చారు. ‘మన దేశంలో బాలల/యువ ప్రతిభకు కొదువ లేదు… తెలుసుకోవాల్సింది మంచి – చెడు అనే దారుల మధ్య సన్నని గీత మాత్రమే! అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి మన దేశం సరికొత్త ఆవిష్కరణలకు నిలయం అవుతుంది’ అంటూ పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ కుర్రాళ్ల ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..