దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్‌స్పైజ్ చేసింది. హర్యానాలోని పంచకులలోని ఓ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్ కార్ల ను బహుమతిగా అందజేశారు. కంపెనీలోని 12 మంది ఉద్యోగుల్ని ‘స్టార్ పర్మార్మర్లుగా’ గుర్తించిన ఆయన వారికి కార్లను దీపావళి బంపర్ బహుమతిగా ఇచ్చారు. అయితే, ఆ 12 మందిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండటం విశేషం. భవిష్యత్తులో మరికొంతమంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇస్తానంటూ ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతోంది. ఇక ఇలాంటిదే మరో సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నీలగిరిలోని ఒక ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్‌లు, ఎల్‌సిడి టెలివిజన్ సెట్‌లు, నగదు బోనస్‌లను బహుమతిగా ఇవ్వడం ద్వారా తన ఉద్యోగుల ఇళ్లల్లో దీపావళిని మరింత ప్రకాశవంతంగా చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతంలో 315 ఎకరాల తేయాకు తోటను సాగు చేస్తున్నారు. 42 ఏళ్ల వయసున్న శివకుమార్ అనే వ్యక్తి 10 ఏళ్ల క్రితం 60 ఎకరాలలో తేయాకు సాగు మొదలుపెట్టారు. కష్టపడి మంచి ఫలితాలతో ఇప్పుడు 315 ఎకరాలకు సాగును విస్తరించారు. అలాగే గార్మెంట్స్ ఉత్పత్తులను కూడా మొదలు పెట్టారు.. అక్కడ కూడా సక్సెస్ అయ్యారు.. దాంతో పాటు అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. తన సక్సెస్ లో తమ వద్ద చాలారోజులుగా పనిచేస్తున్న సిబ్బంది కష్టం కూడా ఉందని గుర్తించారు.. వారికి ఎదో చెయ్యాలని అనుకున్నారు.. దీపావళి సందర్భంగా వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అనుకున్నారు. తమ వద్ద పని చేస్తున్న 15 మంది మేనేజర్, సూపర్వైజర్ స్థాయిలో ఉన్న వారికి బులెట్ బైకులు బహుమతిగా ఇచ్చారు. అలాగే ఖరీదైన ఎల్.ఈ.డి.టివిలను కూడా అందించారు. అలాగే తన వద్ద పని చేసే మరో 625 మంది చిన్న స్థాయి సిబ్బందికి కూడా టీవీలు, బట్టలు అందించారు.
దీంతో శివకుమార్ తమిళనాడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. సిబ్బంది కష్టాన్ని మాత్రమే వాడుకునే యజమానులకు శివకుమార్ ఆదర్శంగా నిలిచారని సోషల్ మీడియా వేదికగా రియల్ హీరో అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..