
కేరళలోని మలప్పురంలో ఎండ వేడిమి కారణంగా కిటికీలు తెరిచి నిద్రించిన ఒక కుటుంబానికి ఎదురైన చేదు అనుభవం ఇంటర్‌నెట్‌లో టాపిక్‌గా మారింది. వేసవిలో భద్రత విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది. మలప్పురం జిల్లాలో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక రాత్రిపూట కిటికీలు తెరిచి నిద్రించిన ఒక ఇంటి నుంచి బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వేడి గాలి తగ్గడానికి, చల్లదనం కోసం కిటికీలు తెరిచి ఉంచిన సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు, కిటికీ గుండా చాకచక్యంగా లోపలికి చేయి పోనిచ్చి, నిద్రిస్తున్న మహిళ కాళ్లకు ఉన్న బంగారు పట్టీలను దొంగిలించారు. బాధితురాలు నిద్ర నుండి లేచేలోపే దొంగలు అక్కడి నుండి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం చూసుకోగా బంగారు పట్టీలు మాయమవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేసవిలో ఇటువంటి చోరీలు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం మలప్పురంలోనే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా కిటికీల ద్వారా మొబైల్ ఫోన్లు, నగలను లాక్కెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కిటికీలకు గ్రిల్స్ ఉన్నప్పటికీ, వాటి మధ్య దూరం ఎక్కువగా ఉంటే దొంగలు లోపలికి చేయి పెట్టే అవకాశం ఉంటుంది. వీలైతే సన్నని నెట్ లేదా మెష్ అమర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.
కిటికీలకు దగ్గరగా నగలు, మొబైల్ ఫోన్లు లేదా పర్సులను ఉంచకూడదని చెబుతున్నారు. ఇంటి బయట వెలుతురు ఉండేలా చూసుకోవడం వల్ల దొంగలు రావడానికి భయపడతారు. వీలైతే ఇంటి ఆవరణలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగలను గుర్తించడం సులభమవుతుంది. చల్లని గాలి కోసం ప్రాణాల కంటే విలువైన సొమ్మును రిస్క్ చేయకండి. కిటికీలు తెరిచినప్పుడు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంతో ముఖ్యం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..