సాధారణంగా ఏదైనా ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు.. ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తాం. మొత్తమంతా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేస్తాం. అలాంటిది ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని తెలిస్తే.? ఇంకేముంది గుండె ఆగినంత పనవుతుంది. ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా అడుగుపెట్టం. కానీ చైనాలో దెయ్యాల ఇంట్లో నిద్రించడమే ఉద్యోగం. ఆ పనికి మంచి జీతం కూడా ముట్టజెప్తారు. అవును, మీరు చదివింది నిజమే. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు ఒక రాత్రంతా హాంటడ్ హౌస్‌లో నిద్రపోయి.. అక్కడేం లేదని నిరూపించాలి. అక్కడ దెయ్యాలు లేదా శాపానికి గురైన ఇళ్లుగా వార్తల్లో నిలిచే వాటిని మార్కెట్‌లో విక్రయించేందుకు పలు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు ఈ ఉద్యోగ ప్రకటనను వెలువరిచాయి.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుందట. వారంతా కూడా చాలా సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్న ఇళ్లల్లో నివసించాల్సి ఉంటుంది. వాటి గురించి బయటికి వచ్చే రూమర్స్ కేవలం కట్టు కథలని నిరూపించడం అంత సులభం కాదని పేర్కొంది. ఈ ఉద్యోగంలో చేరిన వారికి ప్రతీ గంటకు 60 యువాన్లు(అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 700) చెల్లిస్తారు. అలాగే ఆ ఇంట్లో 24 గంటల పాటు ఉంటే ఏకంగా రూ.16,744 అందుతాయి. ఇలా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.
కాగా, చైనాలోని ప్రజలు తరచుగా అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యోగానికి మనుషులు రావడం కష్టమని అంటున్నారు. ఒకవేళ వచ్చినా వారు ఆ ఇంట్లో భయపడుతూ గడపాలి. అంతేకాకుండా తమ యజమానులకు 24 గంటల తర్వాత ఓ వీడియో తీసి.. ఆ ఇంట్లో దెయ్యాలు ఏవి లేవని వివరించాలి. చూడాలి మరీ ఎంతమంది ఈ ఉద్యోగాలు చేస్తారో మరీ..గుండె ధైర్యం కాస్త ఎక్కువగా ఉన్నావారు ఎవరైనా చేరిపోవచ్చునంటున్నారు ఈ వార్త తెలిసిన నెటిజన్లు.