Viral Video: 90 ఏళ్ల అత్తగారిని తలపై మోస్తూ 260 కి.మీ యాత్ర.. కోడలి భక్తికి నెటిజన్లు ఫిదా!
Haryana singer Kajal Choudhary: హర్యానాకు చెందిన గాయని కాజల్ చౌదరి తన 90 ఏళ్ల అత్తగారి కోరికను నెరవేర్చేందుకు ప్రత్యేక బుట్టలో ఆమెను తలపై మోస్తూ 84 కోసుల బ్రజ్ పరిక్రమ యాత్ర చేపట్టింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె భక్తి, సేవాభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

హర్యానాకు చెందిన ప్రముఖ గాయని కాజల్ చౌదరి తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చేందుకు చేసిన విశేష సేవ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన బుట్టలో తన అత్తగారిని తలపై మోస్తూ ఆమె 84 కోసుల(ఒక్కో కోసు 3.2 కి.మీ) బ్రజ్ పరిక్రమ యాత్రను చేపట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో కాజల్ చౌదరి తన అత్తగారిని ప్లాస్టిక్ బుట్టలో కూర్చోబెట్టి తలపై మోస్తూ పవిత్ర బ్రజ్ ప్రదక్షిణను పూర్తి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అత్తగారి ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆమె స్వయంగా యాత్ర చేయలేకపోవడంతో, ఆమె కోరికను నెరవేర్చాలనే సంకల్పంతో ఈ బాధ్యతను తన భుజాలపై తీసుకున్నట్లు కాజల్ తెలిపారు.
“ఇది పూర్తిగా నా స్వంత నిర్ణయం. మా అత్తగారు నన్ను ఇలా చేయమని ఎప్పుడూ అడగలేదు. ఆమె ఆనందం కోసం, నా మనసు తృప్తి కోసం ఈ యాత్ర చేస్తున్నాను” అని కాజల్ చౌదరి వెల్లడించారు.
సుమారు 260 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 84 కోసుల బ్రజ్ పరిక్రమ యాత్ర చెరువులు, అడవులు, పవిత్ర క్షేత్రాలు వంటి అనేక సహజ, ఆధ్యాత్మిక ప్రదేశాల గుండా సాగుతుంది. ఈ యాత్ర శ్రీకృష్ణుడి జీవిత గాథలతో ముడిపడి ఉండటంతో భక్తులు దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ పరిక్రమ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలోని పలు ప్రాంతాలను కలుపుతుంది.
గోవర్ధన్‌లోని శ్రీ ధంగాటి ఆలయ సేవకుడు పవన్ కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం.. సంప్రదాయంగా ఈ యాత్రను పూర్తి చేయడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం పురుషోత్తమ మాసం (అధిక మాసం) సందర్భంగా అనేక మంది భక్తులు ఈ పరిక్రమను పూర్తి చేసేందుకు వస్తున్నారని చెప్పారు.
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే పురుషోత్తమ మాసంలో దేవాలయ దర్శనాలు, యజ్ఞాలు, పరిక్రమలు నిర్వహించడం విశేష పుణ్యఫలాలను అందిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో కాజల్ చౌదరి చేసిన ఈ సేవ భక్తి, కుటుంబ బంధం, అత్త–కోడళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు, అత్తను పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తున్న కోడలు కాజల్‌కు యాత్ర సమయంలో పలు గ్రామాల ప్రజలు వారికి పూలమాలలు వేస్తూ.. హారతులు పట్టి స్వాగతం పలుకుతుండటం విశేషం.
అత్తను మోస్తున్న కోడలి వీడియో..
View this post on Instagram
