నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే చూపించే విభిన్న డేటింగ్ యాప్ !

డేటింగ్ యాప్స్‌లో సాధారణంగా నచ్చిన వ్యక్తుల ప్రొఫైల్స్‌ను చూస్తాం.. స్వైప్ చేస్తాం.. మ్యాచ్ కోసం ఎదురుచూస్తాం. కానీ సింగపూర్ ప్రభుత్వం తెచ్చిన యాప్‌లో ఒకేసారి వందలాది ప్రొఫైల్స్‌ను చూస్తూ స్వైప్ చేసే అవకాశం ఉండదు. ఒక్కో సైకిల్‌లో నెలకు ఒకసారి ఒక మ్యాచ్‌ను మాత్రమే సిఫారసు చేస్తుంది. మ్యాచ్ ను సూచించేటప్పుడు ఇద్దరి మధ్య అనుకూలతకు సంబంధించిన స్కోర్‌తో పాటు, ఆ పరిచయం ఎందుకు సరైందో వివరిస్తూ చిన్న వ్యక్తిగత నోట్ కూడా అందిస్తుంది. అంటే.. ఒక వ్యక్తిని మాత్రమే పరిచయం చేసుకునే విధానాన్ని FirstDate ప్రోత్సహిస్తుంది.

నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే చూపించే విభిన్న డేటింగ్ యాప్ !
Singapore Launches Dating App As Birth Rate Hits Record Low

Updated on: Oct 06, 2026 | 10:46 AM

యూజర్లు ముందుగా యాప్‌ లో తమ గురించి కొన్ని వివరాలు చెప్పాలి. వారి అభిరుచులు, అలవాట్లు, జీవనశైలికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. తమకు నచ్చని విషయాలు, సంబంధంలో ఎలాంటి అంశాలను అంగీకరించలేరో కూడా చెప్పవచ్చు. పిల్లలు కావాలా? వద్దా? అనే విషయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సింగపూర్‌లో జననాల రేటు పడిపోతుండటంతో అవివాహిత ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పరిచయాలు, సంబంధాలను ప్రోత్సహించేందుకు FirstDate appను ప్రభుత్వం తీసుకొచ్చింది.

నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే!

FirstDate యాప్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. సాధారణ డేటింగ్ యాప్స్‌లా వరుసగా ప్రొఫైల్స్ చూపించకుండా.. ఒక్కో సైకిల్‌లో సుమారు నెలకు ఒకసారి ఒక మ్యాచ్‌ను మాత్రమే సిఫారసు చేస్తుంది. మ్యాచ్ ను సూచించేటప్పుడు ఇద్దరి మధ్య అనుకూలతకు సంబంధించిన స్కోర్‌తో పాటు, ఆ పరిచయం ఎందుకు సూచించిందో వివరించే చిన్న వ్యక్తిగత నోట్ కూడా అందిస్తుంది. అంటే.. ఎక్కువ మందిని చూసి త్వరగా నిర్ణయం తీసుకోవడం కాకుండా, ఒక వ్యక్తిని పరిచయం చేసుకుని నెమ్మదిగా ఆ వ్యక్తిని తెలుసుకునే విధానాన్ని FirstDate ప్రోత్సహిస్తోంది.

ఇందుకోసం FirstDateలో Gale-Shapley Stable Marriage Algorithmను ఉపయోగిస్తున్నారు. గణిత శాస్త్రవేత్తలు డేవిడ్ గేల్, లాయిడ్ షాప్లీ అభివృద్ధి చేసిన ఈ విధానం.. పాల్గొనే వ్యక్తుల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని స్థిరమైన జంటలను గుర్తిస్తుంది. అయితే ఈ లెక్కలతో ప్రేమను పూర్తిగా అంచనా వేయలేమని ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తోంది. ఒక జంటకు ఎక్కువ కంపాటిబిలిటీ స్కోర్ వచ్చినంత మాత్రాన వారిద్దరి మధ్య ఆకర్షణ, ప్రేమ, జీవితాంతం కొనసాగే బంధం ఏర్పడుతుందని చెప్పలేం అంటోంది. అల్గారిథమ్ చేయగలిగేది ఒక మంచి పరిచయానికి అవకాశం కల్పించడం మాత్రమే. ఆ పరిచయం ఎలాంటి సంబంధంగా మారుతుందనేది మాత్రం ఇద్దరు వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది.

మ్యాచ్ వచ్చిన తర్వాత 72 గంటల సమయం

ఇద్దరికి మ్యాచ్ కుదిరిన తర్వాత.. వారిద్దరికీ SMS ద్వారా సమాచారం అందుతుంది. ఆ తర్వాత 72 గంటల్లో తాము పరిచయం కొనసాగించాలనుకుంటున్నామా లేదా అనేది నిర్ణయించుకోవాలి. భద్రత, గోప్యత కోసం యూజర్ల గుర్తింపును Singpass ద్వారా ధ్రువీకరిస్తారు. ఒక వ్యక్తి ప్రొఫైల్‌ను అందరూ చూడలేరు. మ్యాచ్ అయిన వ్యక్తికి మాత్రమే అది కనిపిస్తుంది. సింగపూర్‌లో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోయింది. 2025లో దేశంలో 29,864 మంది శిశువులు మాత్రమే జన్మించారు. పెళ్లి చేసుకుంటున్న పురుషుల సగటు వయసు 31 సంవత్సరాలు కాగా.. మహిళల సగటు వయసు 29.6 సంవత్సరాలుగా నమోదైంది. దీంతో యువత మధ్య పరిచయాలు, సంబంధాలను ప్రోత్సహించేందుకు FirstDate appను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది.

సింగపూర్‌కు ఇది కొత్త ప్రయోగం కాదు

యువత మధ్య సంబంధాలను ప్రోత్సహించేందుకు సింగపూర్ ప్రభుత్వం గతంలో కూడా ప్రయత్నాలు చేసింది. 1984లో విద్యావంతులైన అవివాహిత యువత మధ్య పరిచయాలను పెంచేందుకు Social Development Unitను ఏర్పాటు చేసింది. అయితే FirstDate మాత్రం పూర్తిగా కొత్త తరహా ప్రయోగం. ప్రజలను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం దీని ఉద్దేశం కాదని తెలుస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి వ్యక్తుల ఎంపిక, గోప్యత, అభిరుచులకు అనుగుణంగా అర్థవంతమైన పరిచయాలను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. తగ్గుతున్న జననాల రేటు సమస్యకు ప్రభుత్వ విధానాలతో పరిష్కారం అందించలేమని భావించిన సింగపూర్.. ఇప్పుడు ప్రేమ, పరిచయాల విషయంలోనూ టెక్నాలజీని ప్రయోగిస్తోంది. నెలకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఇచ్చే ఈ ప్రభుత్వ డేటింగ్ యాప్ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us