కేవలం రూ.20కే కడుపునిండా భోజనం.. ఈ హోటల్‌ ఎక్కడుందంటే?

ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ భోజన కేంద్రం పనిచేస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకే భోజనం కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, బ్యాచిలర్లు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఇక్కడ భోజనం చేస్తున్నారు. కొంతమంది బ్యాచిలర్లు గదుల్లో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో..

కేవలం రూ.20కే కడుపునిండా భోజనం.. ఈ హోటల్‌ ఎక్కడుందంటే?
Rs 20 For A Full Meal In Vijayawada

Updated on: Aug 31, 2026 | 6:32 PM

విజయవాడ, ఆగస్ట్‌ 31: సాధారణ హోటల్‌లో భోజనం చేయాలంటే కనీసం రూ.100 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కానీ విజయవాడలోని మొఘల్‌రాజపురంలో మాత్రం కేవలం రూ.20కే కడుపునిండా భోజనం అందిస్తున్నారు. అన్నం, కూర, చట్నీ, సాంబారు, మజ్జిగతో కూడిన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తూ.. ఆకలితో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు సాక్షి ఆదినారాయణ, ఆయన సోదరుడు. ‘మన భోజనం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ భోజన కేంద్రంలో అన్నం, కూర, చట్నీ, సాంబారు, మజ్జిగతో సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనం తయారు చేయడానికి సుమారు రూ.50 వరకు ఖర్చవుతున్నప్పటికీ.. కేవలం రూ.20కే భోజనం పెడుతున్నారు. మిగిలిన మొత్తాన్ని నిర్వాహకులే భరిస్తున్నారు. తమకు చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే భోజనం ధరను తగ్గించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు..

ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ భోజన కేంద్రం పనిచేస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకే భోజనం కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, బ్యాచిలర్లు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఇక్కడ భోజనం చేస్తున్నారు. కొంతమంది బ్యాచిలర్లు గదుల్లో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో.. రూ.20కే మంచి భోజనం లభించడం వారికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇక్కడ భోజనం చేస్తున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. మొదట రూ.20కే భోజనం పెడుతున్నారని తెలుసుకుని ఒకసారి ప్రయత్నిద్దామని వచ్చాను. మొదటిసారి భోజనం చేసిన తర్వాత రుచి బాగుండటంతో అప్పటి నుంచి నలుగురు స్నేహితులతో కలిసి వచ్చి ప్రతిరోజూ ఇక్కడే భోజనం చేస్తున్నామని తెలిపారు. రూ.20 పెద్ద మొత్తం కాదు. కానీ ఆ ధరకు లభించే భోజనం మాత్రం చాలా బాగుంది. బయట హోటళ్లలో లభించే భోజనం కంటే ఇక్కడి భోజనం రుచిగా అనిపించింది. అందుకే అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఇక్కడే తింటున్నామని చెప్పారు.

ఇంటి వంటలాగే..

భోజనం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంట్లో ఎలా వంట చేసుకుంటామో.. ఇక్కడ కూడా అలాగే వంట చేస్తామని తెలిపారు. వంట మాస్టర్‌పై పూర్తిగా ఆధారపడకుండా తామూ వంట ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. గరం మసాలాలు, బయట దొరికే పులుసు పొడులు వంటివి ఉపయోగించకుండా, అవసరమైన మసాలా పొడులను ఇంట్లోనే తయారు చేసుకుని ఇక్కడ ఉపయోగిస్తున్నామని వివరించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఆలోచన వచ్చిన వెంటనే కేవలం ఐదు రోజుల్లోనే ఏర్పాట్లు పూర్తి చేసి ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. రోజుకు 100 నుంచి 200 మంది వరకు భోజనం చేస్తున్నారని చెప్పారు. భోజనం కోసం వచ్చే వారి సంఖ్య పెరిగినా.. తమకు సాధ్యమైనంత వరకు అందరికీ భోజనం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిర్ణయించిన సమయం 3 గంటల తర్వాత వచ్చినా, ఆహారం అందుబాటులో ఉంటే తప్పకుండా భోజనం పెడతామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

‘మీ భోజనం బాగుంది.. గాడ్ బ్లెస్ యూ’

ఇక్కడ భోజనం చేసినవారు తిరిగి వచ్చి తమను అభినందించడం నిర్వాహకులకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. ‘మీ భోజనం చాలా బాగుంది.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ పలువురు చెప్పడం తమ శ్రమనంతా మరిపిస్తోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తమ పిల్లలు స్థిరపడటంతో తమకు వస్తున్న మిగులు ఆదాయాన్ని ఈ సేవా కార్యక్రమానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఈ భోజన కేంద్రానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఉన్నవారు, లేనివారు అనే తేడా లేదు. అందరూ రూ.20 చెల్లించి భోజనం చేస్తున్నారు. తమ డబ్బులతో తింటున్నామనే సంతృప్తితో వారు భోజనం చేస్తున్నారు. మేము కూడా కొంత మొత్తాన్ని సేవగా అందిస్తున్నామనే తృప్తి మాకు ఉందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎంతకాలం కొనసాగిస్తారనే ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన సమాధానం ఎంతో ప్రత్యేకంగా ఉంది. ‘మేము ఎంతకాలం బతికి ఉంటామో మాకు తెలియదు. అప్పటి వరకు ఈ సేవ కొనసాగిస్తాం’ అని వారు తెలిపారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టాలనే ఆలోచనతో ప్రారంభమైన ‘మన భోజనం’.. ఇప్పుడు విజయవాడలో ఎంతోమందికి ఆకలి తీర్చే ఆపన్నహస్తంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us