Viral Video: ఇదీ కదా ప్రేమ అంటే.. తల్లి కోడిని చంపేసిన కుక్క.. పిల్లల కోసం పుంజు చేసిన పనికి అంతా ఫిదా..

తల్లి కోడిని కుక్క చంపేయడంతో అనాథలైన కోడిపిల్లలను పెంచే బాధ్యతను లాల్య అనే మగ కోడి తీసుకుంది. తల్లిలాగే ఈ కోడి పిల్లలకు ఆహారం ఇస్తూ, రెక్కల కింద దాచుకుంటూ.. ప్రమాదాల నుంచి కాపాడుతోంది. ఈ ప్రేమ, బాధ్యత చూసి రైతు కుటుంబం ముగ్ధులై, ఆ కోడిని ఎప్పటికీ అమ్మదే లేదని నిర్ణయం తీసుకుంది.

Viral Video: ఇదీ కదా ప్రేమ అంటే.. తల్లి కోడిని చంపేసిన కుక్క.. పిల్లల కోసం పుంజు చేసిన పనికి అంతా ఫిదా..
Rooster Taking Care Of Chicks

Updated on: Oct 01, 2025 | 6:01 PM

సాధారణంగా కోడిపిల్లలను పెంచే బాధ్యత తల్లి కోడిదే. ఆహారం ఇవ్వడం, వేటాడటం, రక్షణ కల్పించడం అన్నీ అదే చూసుకుంటుంది. కానీ పూణేలోని భోర్ తాలూకా వాథర్ హిమా గ్రామంలో కోడి చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి లేని కోడిపిల్లలను పెంచే బాధ్యతను ఈ కోడి తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగింది..?

వాథర్ హిమా గ్రామానికి చెందిన రైతు అర్జున్ ఖట్పే ఇంట్లో ఒక కోడి 10-12 గుడ్లను పొదిగి పిల్లలను చేసింది. అయితే దురదృష్టకర సంఘటనలో.. ఆ తల్లి కోడి పిల్లలతో కలిసి మేస్తుండగా ఒక వీధి కుక్క దానిని వేటాడి చంపేసింది. తల్లి కోడి మరణించడంతో కోడిపిల్లలను ఎవరు చూసుకుంటారా అని రైతు ఆందోళన చెందాడు. ఆ పిల్లలను ఇంటి షెడ్‌లో ఉంచాడు. కానీ పిల్లలను పొదిగి చూసుకునేందుకు ఇతర కోళ్ళు ఏవీ సిద్ధంగా లేవు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ రైతు ఇంట్లోని లాల్య అనే ఎర్ర కోడి ఆ పిల్లల దగ్గరకు వచ్చింది.

లాల్య కోడి చేసిన గొప్ప పని

తల్లి కోడి ఎలా అయితే చూసుకుంటుందో అదే విధంగా ఈ లాల్య కోడి ఆ పిల్లలకు తల్లిలా మారింది. కోడిపిల్లలను తన రెక్కల కింద పెట్టుకుని వెచ్చదనం ఇస్తోంది.
ముక్కుతో వాటికి ఆహారం తినిపిస్తోంది. వాటితో ఆడుకుంటూ కాకులు లేదా కుక్కల నుంచి రక్షిస్తోంది. లాల్య కోడి చేస్తున్న ఈ అద్భుతమైన పనిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తున్నారు.

ఎప్పటికీ అమ్మం..

“ఈ కోడిపిల్లలు ఒక్క క్షణం కూడా లాల్యను వదలడం లేదు. ఇంత అద్భుతం నేను నా 80 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదు” అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఈ కోడి చూపించే ప్రేమ చూసి “కోడిపిల్లలను ఇంత బాగా పెంచుతున్న ఈ గొప్ప కోడిని మేము ఎప్పటికీ అమ్మబోము. చివరి వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం” అని రైతు కుటుంబం సంతోషంగా చెప్తోంది. జంతువుల్లో కూడా ఇంతటి ప్రేమ, బాధ్యత ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.