ప్రపంచంలో తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారతాయి. వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టంగా ఉంటుంది. అలాంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరూ అది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓ 39 ఏళ్ల వ్యక్తి రెండు రోజుల పాటు థియేటర్ గోడలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. ఆ వ్యక్తిని రక్షించడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.. అతడి పరిస్థితిని చూసి ఖంగుతిన్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సైరాకస్ నగరంలోని ఓ థియేటర్ గోడలో 39 ఏళ్ల వయసున్న వ్యక్తి చిక్కుకున్నాడు. ఆ రోజు థియేటర్‌లో సినిమా ప్రదర్శన లేకపోవడంతో క్లీనింగ్ చేసే సిబ్బంది ఎప్పటిలానే యధాలాపంగా తమ పనిలో నిమగ్నమైపోయారు. అయితే వారిలో ఒకరికి గోడ నుంచి వింత శబ్దాలు రావడం వినిపించాయి. ఏంటా అని తీక్షణంగా వింటే.. అవి ఓ వ్యక్తి ఆర్తనాదాలు అని అర్ధమయ్యాయి. అయితే ఇంతకీ అవి ఎక్కడ నుంచి వస్తున్నట్లు.? థియేటర్‌లో పని చేస్తున్న సిబ్బంది నలుమూలల వెతికారు. చివరికి ఆ అరుపులు థియేటర్‌లోని జెంట్స్ బాత్‌రూమ్‌లో నుంచి వస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ‘గోడలను బాదుతూ.. హెల్ప్.. హెల్ప్’ అంటూ ఎవరో అరుస్తున్నారు. దీనితో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు.
కాగా, ఆ సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని.. మొదటిగా గోడకు ఓ చిన్న రంధ్రాన్ని చేసి ఫైబర్-ఆప్టిక్ కెమెరా ద్వారా వ్యక్తి ఎక్కడున్నాడన్నది తెలుసుకున్నారు. ఆ వ్యక్తి నగ్నంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సుమారు రెండు గంటల పాటు శ్రమించి అతడిని బయటికి తీశారు. తక్షణమే చికిత్స నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. సుమారు రెండు లేదా మూడు రోజుల క్రిందట సదరు వ్యక్తి ధియేటర్‌లో ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్ సిబ్బంది ఎవరూ కూడా అతడిని చూడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు వివరించారు. అంతేకాకుండా అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఘటన ప్రపంచ మీడియాలో పెద్ద సెన్సేషన్ కాగా, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.