Narmada River: తూర్పు నుంచి పశ్చిమ దిశకు ప్రవహిస్తూ.. పాపాలను తొలగించే నర్మదానది విశిష్టత ఏమిటంటే..

Narmada River: హిందువులు పవిత్రంగా పూజించే అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి నర్మదానది. భారతదేశంలోని గంగా, యమునా ఇలా చాలా నదులు ఒకే దిశలో..

Narmada River: తూర్పు నుంచి పశ్చిమ దిశకు ప్రవహిస్తూ..  పాపాలను తొలగించే నర్మదానది విశిష్టత ఏమిటంటే..
Narmada River
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2021 | 8:00 PM

Narmada River: హిందువులు పవిత్రంగా పూజించే అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి నర్మదానది. భారతదేశంలోని గంగా, యమునా ఇలా చాలా నదులు ఒకే దిశలో ప్రవహిస్తాయి. పడమర నుంచి తూర్పుదిశగా ప్రయాణం సాగిస్తాయి. అయితే మన దేశంలో పడమర నుండి తూర్పుకు బదులుగా తూర్పు నుండి పడమరకు ప్రవహించే నదులున్నాయి. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు తపతి నది, మహి నది. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంట తలకిందులుగా ప్రవహించే ఏకైక నది నర్మదా నది. ఈ నదిని రేవా అని కూడా అంటారు.

జన్మస్థలం-నర్మదామాత గుడి: 

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఎత్తౖన కొండలతో ఆకట్టుకునే పచ్చటి అరణ్య సౌందర్యంతో కనులు విందు చేసే  అమర్ కంటక్ నర్మదా నది జన్మస్థానం. నర్మదా ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదామాత గుడి కూడా వెలసింది. నర్మదామాత గుడి ఎదురుగా పార్వతీదేవి ఆలయం వుంది. ఇక్కడ శివరాత్రికి జాతర జరుగుతుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు జాతరలు జరుగుతాయి. నర్మదానది అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి మాండ్ల కొండల్లో మెలికలు తిరుగుతూ ప్రవహించి, జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య, సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్ను చేరుతున్నది. నర్మదా నది మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది. ఈ నది మొత్తం దేశంలో 1,289 కిలోమీటర్లు పొడవులో ప్రవహిస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్, గుజరాత్‌లకు జీవనాధారం.దీనికి 41 ఉపనదులు ఉన్నాయి. వీటిలో 22 నదులు ఎడమ ఒడ్డున, 19 నదులు కుడి ఒడ్డున కలుస్తాయి.

నర్మదా నది భారత దేశంలో మధ్యగా ప్రవహిస్తూ.. ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా ఖ్యాతిగాంచింది. అయితే నర్మదానది వెనుకకు ప్రవహించడానికి కారణం..  రిఫ్ట్ వ్యాలీ. రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉంది. అందుకనే నర్మదానది తూర్పు నుండి పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అన్ని నదుల మాదిరిగా కాకుండా, నర్మదా నది యొక్క రివర్స్ ప్రవాహం గురించి పురాణాలలో చాలా కథలున్నాయి.

సోనభద్రను నర్మద వివాహం చేసుకోవాలని ఉంది. కానీ సోనభద్ర నర్మద స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడు.  దీంతో కోపోద్రిక్తుడైన నర్మద తన జీవితాంతం కన్యగా ఉండి వ్యతిరేక దిశలో ప్రవహించాలని నిర్ణయించుకుంది. మనం భౌగోళిక స్థానాన్ని కూడా పరిశీలిస్తే.. నర్మదా నది ఒక నిర్దిష్ట సమయంలో సోనభద్ర నది నుండి విడిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. నేటికీ ఈ నది ఇతర నదుల్లా కాకుండా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది.

Also Read:  రేపటి నుంచి మండల పూజకు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. వర్షాల దృష్ట్యా భక్తులకు స్పాట్ బుకింగ్ నిలిపివేత…