సోషల్ మీడియా పుణ్యమా! అని పొద్దున లేస్తే.. ఎన్నో రకాల వీడియోలు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తున్నాయి. నిద్రలేవగానే ఏం చేయాలి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? ఇంటి వాస్తు, పూజా విధానాలు, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి ఇలా ఎన్నో రకాల వార్తలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా జనాలు ఇట్టే తెలుసుకుంటున్నారు. ఇకపోతే, ఇటీవల కాలంలో ఎక్కువగా వంటలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. పల్లెలు మొదలు పట్టణాల వరకు వంటలపై ఆసక్తి ఉన్నవారు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు.
అలాగే, వివిధ రకాల వంటకాల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో వెరైటీ రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఒక వ్యక్తి చేస్తున్న వంటకం స్టైల్ మాత్రం అస్సలు చూసుండరు. అది చూస్తే మాత్రం మీరు కూడా విస్తుపోతారు.
సాధారణంగా చికెన్ ఫ్రై అంటే.. చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసుకుని ఓ గంటపాటు ఆగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. ఇది అందరికీ తెలిసిందే.. కానీ, వైరల్ వీడియోలో వ్యక్తి చేసిన చికెన్ ఫ్రై అలా లేదు.. అతడు ముందుగా అల్లం వెల్లుల్లి, కొన్ని రకాల మసాల పొడులతో చికెన్‌ని మేరినేషన్ చేశాడు.. ఆ తరువాత దాన్ని పేపర్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. అలా ఒక్కో చికెన్ ముక్కను పేపర్ బ్యాగ్‌లో పిన్ చేసి నేరుగా డీప్ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్ బ్యాగ్ కాబట్టి చక్కగా చికెన్ ఆ పేపర్ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్ చేయగానే చికెన్‌లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. దాంతో పాటు టేస్ట్‌కి టేస్టు ఉంటుంది.
వైరల్‌గా మారిన ఈ వీడియో మలేషియాకు చెందినదిగా తెలిసింది. మలేషియా వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి ఇలా డిఫరెంట్ స్టైల్‌లో చికెన్ చేస్తూ కనిపించాడు. దాంతో అందరి దృష్టి అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది మరింత మందిని ఆకర్షిస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియోని ఫుడ్ వ్లాగర్ వెరైటీగ్ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్ పెట్టి మరీ పోస్టు చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్‌లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..