Pani puri seller celebrates daughter’s birth: ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ లింగ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. తల్లి కడుపులో పెరుగుతున్న ఆడపిల్లలను.. చంపేసే ఘటనలు నేటికి వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో.. తనకు ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి తెగ సంబరపడ్డాడు. సంతోషంతో వేలాది రూపాయలు ఖర్చుచేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని కోలార్‌లో జరిగింది. భోపాల్ పట్టణంలోని కోలార్కి చెందిన అంచల్ గుప్తా పానీ పూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 17న తనకు కూతురు పుట్టింది. ఎప్పుడూ.. ఆడపిల్లలతోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మే అంచల్‌కు కూతురు పుట్టిందన్న విషయం తెలియడంతో ఎగిరి గంతేశాడు. తన మహాలక్ష్మి భూవి మీదకు వచ్చిందని.. గుర్తుగా ఏమైనా చేయాలనుకున్నాడు.
దీనికి అతను రూ.50వేలు ఖర్చు చేశాడు. ఆదివారం కోలార్ పట్టణ వాసులందరికీ రూ.50వేల ఖర్చు చేసి ఉచితంగా పానీ పూరి అందించాడు. ఈ సందర్భంగా అంచల్ మాట్లాడుతూ.. తనకు ఆడపిల్ల పుట్టడం ఒక కల అని పేర్కొన్నాడు. వివాహం చేసుకున్నప్పటి నుంచి.. అమ్మాయే పుట్టాలని కోరుకున్నానని.. కానీ మొదటి సంతానంలో కొడుకు పుట్టాడని తెలిపాడు. అయితే ఇప్పుడు అదృష్టం బాగుండి కూతురు జన్మించిందని తెలిపాడు. అమ్మాయి పుట్టడం.. అదే విధంగా కొడుకు రెండవ పుట్టినరోజు కావడంతో పానీ పూరీని అందించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.
అమ్మాయిలు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని అంచల్ తెలిపాడు. ఈ సందేశాన్ని తీసుకెళ్లేందుకు ఉచితంగా పానీపూరిని పంపిణీ చేశానని తెలిపాడు. సమాజంలో ఆడ, మగ తేడాలేదని.. అందరూ సమానమేనని.. తెలిపాడు. అయితే.. అంచల్ గుప్తా చేసిన ఈ ప్రయత్నం స్థానికంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. అతని నిర్ణయాన్ని చాలా మంది అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు.
Also read: