
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో పాకిస్థాన్ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఒక స్వర్ణకారుడు వెల్లడించిన వివరాల ప్రకారం, అక్కడ బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇటీవల భారతదేశంలో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి. అయినప్పటికీ, అవి ఇప్పటికీ సామాన్యుడికి అందుబాటులో లేనట్లుగానే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో బంగారం ధర సోషల్ మీడియాలో ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక హిందూ స్వర్ణకారుడు పాకిస్థాన్‌లోని బంగారం ధరను వెల్లడించారు. ఆయన వెండి ధరను కూడా తెలియజేస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్‌లో ఒక తులం 24-క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం సుమారు 4,30,000 నుండి 4,50,000 పాకిస్తానీ రూపాయల మధ్య ఉంది. కొన్ని మార్కెట్లలో, ధర ఇంకా పెరగవచ్చు. వెండి ధరలు కూడా తక్కువగా లేవు. పాకిస్తాన్‌లో ఒక తులం వెండి సుమారుగా 7,000 నుండి 7,400 పాకిస్తానీ రూపాయలకు లభిస్తుంది. భారతదేశంలో వెండి ధరలు దీని కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
సాధారణంగా బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయి. అయితే, పాకిస్థాన్‌లో ఈ ధరలు అదుపు లేకుండా పెరగడానికి ప్రధాన కారణం అక్కడి ద్రవ్యోల్బణం. పాకిస్థాన్ రూపాయి విలువ రోజురోజుకీ పడిపోవడం, విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోవడంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం కూడా అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, పాకిస్థాన్ కరెన్సీ పతనం నేరుగా బంగారం ధరపై ప్రభావం చూపిస్తోంది.
భారతదేశంలో బంగారం ధరలు కూడా అస్థిరంగా ఉన్నప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ పాకిస్థాన్‌తో పోలిస్తే చాలా స్థిరంగా ఉంది. పాకిస్థాన్‌లో ఒక తులం బంగారం ధర అక్కడ సామాన్యుడు కొనలేనంత స్థాయికి చేరింది.
ప్రస్తుతం, భారతదేశంలో ఒక తులం బంగారం ధర సుమారు రూ.161,000 నుండి రూ.1,65,000 (INR) వరకు ఉండగా, పాకిస్తాన్‌లో అదే బంగారం ధర రూ.4 లక్షలకు పైగా ఉంది. అక్కడ స్వర్ణకారుడు పేర్కొన్న ధరలు, భారత్‌లోని ధరలతో పోల్చినప్పుడు దాదాపు రెండు రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే పాకిస్తానీ రూపాయి బలహీనంగా ఉండటం, ద్రవ్యోల్బణం, దిగుమతులపై ఆధారపడటం వంటివి అక్కడ బంగారం ధరను పెంచుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఆ స్వర్ణకారుడు పాకిస్తాన్‌లో తన వ్యాపారం బాగానే సాగుతోందని చెప్పాడు. కానీ, ద్రవ్యోల్బణం కారణంగా వినియోగదారులు తగ్గిపోతున్నారని వివరించాడు. పాకిస్తాన్‌లో బంగారం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఆ స్వర్ణకారుడు స్వయంగా పాకిస్తాన్‌లోనే నివసిస్తూ, పనిచేస్తున్నాడు. రెండు దేశాల్లోని ధరల గురించి అతనికి బాగా తెలుసు. ఒక సాధారణ పౌరుడికి వివాహాలు లేదా ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనడం ఇప్పుడు అక్కడ ఒక కలగానే మిగిలిపోతోంది.
పాకిస్థాన్‌లో కేవలం బంగారం మాత్రమే కాదు, పిండి, పప్పులు, పెట్రోల్ వంటి నిత్యావసర ధరలు కూడా సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరల పెంపు అనేది ఆర్థిక వ్యవస్థ పతనానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలు తమ ఆస్తులను, పొదుపును కాపాడుకోవడానికి బంగారాన్ని ఒక ఆశ్రయంగా భావిస్తారు. కానీ, అది కూడా ఇప్పుడు వారికి అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, పండుగలకు కూడా ప్రజలు కొద్ది మొత్తంలో మాత్రమే బంగారం కొంటున్నారు. చాలా కుటుంబాలు కుటుంబాన్ని పోషించుకోవడానికి పాత బంగారాన్ని అమ్ముకుంటున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వైరల్ వీడియో కేవలం బంగారం ధరల గురించే కాదు, ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పడిపోతాయో తెలియజేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భారత్, పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న అంతరాన్ని చర్చిస్తూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..