
మరి కొన్ని రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోనుంది. 2025కు వీడ్కోలు చెబుతూ 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే అందరం ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేయరని మీకు తెలుసా..? భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో సూర్యోదయం అయినట్లే, నూతన సంవత్సర వేడుకలు కూడా ఒక్కో చోట ఒక్కో సమయంలో మొదలవుతాయి. అసలు ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కేక్ కట్ చేసేది ఎవరు? చిట్టచివరగా న్యూఇయర్ జరుపుకునేది ఎక్కడ? అనే వివరాలను తెలుసుకుందాం..
ప్రపంచ పటంలో తూర్పున ఉండే కిరితిమతి ద్వీపం లేదా క్రిస్మస్ ఐలాండ్ నూతన సంవత్సరాన్ని అందరికంటే ముందుగా న్యూఇయర్ జరుపుకుంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దేశంలో భాగమైన ఈ ద్వీపంలో సుమారు 1.20 లక్షల జనాభా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడి గ్రామాల పేర్లు పారిస్, పోలాండ్, లండన్. ప్రపంచం ఇంకా డిసెంబర్ 31 రాత్రి పనుల్లో ఉండగానే ఇక్కడ అర్థరాత్రి 12 గంటలు దాటి 2026 ప్రారంభమవుతుంది.
కిరితిమతి తర్వాత నూతన సంవత్సరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నగరాలను పలకరిస్తుంది. న్యూజిలాండ్ చాథమ్ దీవుల్లో భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 3:45 గంటలకే 2026 వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆక్లాండ్, వెల్లింగ్టన్ వంటి నగరాల్లో సాయంత్రం 4:30 గంటలకు వేడుకలు మొదలవుతాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రసిద్ధ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచా వెలుగులు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతాయి. అడిలైడ్, మెల్‌బోర్న్ నగరాల్లో కూడా దాదాపు ఇదే సమయంలో సంబరాలు జరుపుకుంటారు.
మనం డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయానికి.. జపాన్, కొరియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే తమ వేడుకలను ముగించుకుంటాయి. మనం వేడుకలు జరుపుకున్న తర్వాత ఐరోపా దేశాలు (లండన్, పారిస్), ఆ తర్వాత చివరగా అమెరికా ఖండం కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.
ప్రపంచమంతా జనవరి 1 వేడుకల్లో మునిగిపోయినా పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికన్ సమోవా మాత్రం ఇంకా డిసెంబర్ 31నే ఉంటుంది. ఇది UTC-11 టైమ్ జోన్‌లో ఉండడం వల్ల ప్రపంచంలో అందరికంటే చివరగా ఇక్కడ నూతన సంవత్సరం మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం.. జనవరి 1వ తేదీ సాయంత్రం 4:30 గంటల సమయానికి అమెరికన్ సమోవాలో అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. అంటే మనం జనవరి 1 లంచ్ ముగించే సమయానికి వారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు.
కాలం ఒకటే అయినా, భూమి తిరిగే వేగం మనకు ఈ వింతైన అనుభూతిని ఇస్తుంది. కిరితిమతిలో మొదలైన 2026 ప్రయాణం, అమెరికన్ సమోవాతో ముగుస్తుంది.