హాలీవుడ్ మువీ స్టైల్లో.. కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్‌ చోరీ! ముగ్గురు మృతి.. వీడియో

ఈజిప్టులో దొంగల ముఠా కదులుతున్న ఫ్రోజెన్‌ చికెన్‌ ట్రక్కులో సినిమా తరహాలో చోరీకి పాల్పడింది. పికప్‌ వాహనంతో ట్రక్కును వెంబడించి, దానిపైకి ఎక్కి సుమారు 105 కిలోల చికెన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు నిందితులను గుర్తించగా.. అరెస్టు సమయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

హాలీవుడ్ మువీ స్టైల్లో.. కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్‌ చోరీ! ముగ్గురు మృతి.. వీడియో
Egypt Chicken Truck Robbery

Updated on: Aug 31, 2026 | 8:19 PM

ఈజిప్టులో ఓ దొంగల ముఠా కదులుతున్న ఫ్రోజెన్‌ చికెన్‌ ట్రక్కులో సినిమా తరహాలో చోరీకి పాల్పడింది. ఏకంగా 100 కిలోలకు పైగా చికెన్‌ను దోచుకెళ్లిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించగా.. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిందితులు మృతి చెందారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కదులుతున్న ట్రక్కుపైకి ఎక్కి..

ఈ ఘటన ఆగస్టు 25న కైరోలోని ఓ హైవేపై చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు నాలుగు టన్నుల ఫ్రోజెన్‌ చికెన్‌ను తరలిస్తున్న రిఫ్రిజిరేటెడ్‌ ట్రక్కును దుండగులు టార్గెట్‌ చేశారు. వేగంగా వెళ్తున్న ట్రక్కును ఓ పికప్‌ వాహనంతో వెంబడించిన ఇద్దరు వ్యక్తులు.. దాని వెనుక భాగానికి చేరుకున్నారు. పికప్‌ వాహనం ముందు భాగంపైకి ఎక్కిన వారు.. కదులుతున్న ట్రక్కు వెనుక తలుపులను తెరిచారు. అనంతరం అందులోని చికెన్‌ బాక్సులను ఒక్కొక్కటిగా పికప్‌ వాహనంలోకి తరలించారు. రెండు వాహనాలు వేగంగా కదులుతుండగానే ఈ చోరీ జరగడం గమనార్హం. ఈ దృశ్యాలను వెనుక నుంచి వెళ్తున్న ఓ వాహనదారుడు వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగల చోరీ తీరును చూసిన నెటిజన్లు దీనిని ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సినిమా యాక్షన్‌ సన్నివేశాలతో పోల్చారు. అయితే ట్రక్కు డ్రైవర్‌కు చోరీ జరుగుతున్న విషయం తెలియకపోవడం గమనార్హం. అనంతరం ట్రక్కును పరిశీలించగా సుమారు 105 కిలోల చికెన్‌ కనిపించకుండా పోయినట్లు గుర్తించాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఆధారంగా పోలీసుల దర్యాప్తు.. కాల్పులు

వైరల్‌ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఆరుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు. వీరందరికీ గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు ఈజిప్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కైరో, కల్యూబియా ప్రాంతాల్లోని వారి స్థావరాలను పోలీసులు గుర్తించారు. హైవేపై జరిగిన చోరీతో వారికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు సేకరించిన అనంతరం అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు మృతి చెందగా.. మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఆయుధాలతో పాటు చోరీకి ఉపయోగించిన పికప్‌ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోచుకున్న చికెన్‌లో కొంత భాగాన్ని, ఇతర చోరీలకు సంబంధించిన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన ముగ్గురు నిందితులపై సాయుధ దోపిడీ, భద్రతా సిబ్బందిపై కాల్పులు వంటి అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఆహార పదార్థాలకు సంబంధించిన విచిత్రమైన చోరీలు వెలుగులోకి వస్తున్నాయి. 2026 మేలో కెనడాలో ఓ షిప్‌మెంట్‌ నుంచి 12 టన్నులకు పైగా కిట్‌క్యాట్‌ చాక్లెట్లు చోరీకి గురైన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ప్రాంతాల్లో మిగిలిన సరుకుల రవాణాపై భద్రతను మరింత పెంచారు.

Loading...
Unable to load recommendations.
Follow Us