నమ్మశక్యం కాని ప్రమాదం.. సిగ్నల్ స్తంభానికి వేలాడుతున్న బైక్.. నివ్వెరపోయిన జనం!

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక వింత రోడ్డు ప్రమాదం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సర్రే - డెల్టా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో, ప్రమాద తీవ్రతకు ఒక మోటార్‌సైకిల్ ఏకంగా గాలిలోకి ఎగిరి, ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపై ఇరుక్కుపోయింది. సినిమాల్లోని గ్రాఫిక్ సీన్‌ను తలపించే ఈ దృశ్యం చూసి స్థానికులు, వాహనదారులు విస్తుపోతున్నారు.

నమ్మశక్యం కాని ప్రమాదం.. సిగ్నల్ స్తంభానికి వేలాడుతున్న బైక్.. నివ్వెరపోయిన జనం!
Motorcycle Hanging Street Light

Updated on: May 10, 2026 | 10:50 PM

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక వింత రోడ్డు ప్రమాదం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సర్రే – డెల్టా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో, ప్రమాద తీవ్రతకు ఒక మోటార్‌సైకిల్ ఏకంగా గాలిలోకి ఎగిరి, ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపై ఇరుక్కుపోయింది. సినిమాల్లోని గ్రాఫిక్ సీన్‌ను తలపించే ఈ దృశ్యం చూసి స్థానికులు, వాహనదారులు విస్తుపోతున్నారు.

డెల్టా పోలీసుల కథనం ప్రకారం, శనివారం (మే 09) మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో స్కాట్ రోడ్, 72వ అవెన్యూ కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. అతివేగంగా వస్తున్న ఒక మోటార్ సైకిల్, ఒక సెడాన్ కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఢీకొన్న వేగానికి బైక్ అదుపుతప్పి గాలిలోకి ఎగిరి, రోడ్డు పైన వేలాడుతున్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల మధ్యలో ఇరుక్కుపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, ప్రస్తుతం అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ధృవీకరించారు. మరోవైపు, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటం విశేషం.

ఈ భయానక దృశ్యాన్ని కళ్లారా చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఈ వింత ప్రమాదాన్ని చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా 70వ అవెన్యూ నుండి 72వ అవెన్యూ వరకు రోడ్డును మూసివేశారు. సిగ్నల్ పైన చిక్కుకున్న బైక్‌ను కిందకు దించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. చివరకు భారీ క్రేన్ల సహాయంతో మోటార్‌సైకిల్‌ను సురక్షితంగా కిందకు దించి, రోడ్డును శుభ్రం చేసిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఈ అసాధారణ ప్రమాదమే ఒక నిదర్శనం. పోలీసులు ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us