మోచేతి పై కీబోర్డ్ టాటూతో.. తల్లితో కొడుకు కబుర్లు.. ఆశ్యర్యపోతున్న వైద్యులు 

Jessica Fletcher: అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదు. తన బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా  భరిస్తుంది. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది.  కెనడాకు చెందిన ఈ తల్లే అందుకు గొప్ప ఉదాహరణ. ఆటిజం ఉన్న కుమారుడి కోసం నొప్పిని పంటి కింద భరిస్తూనే చేతి మీద టాటూ వేయించుకుంది

మోచేతి పై కీబోర్డ్ టాటూతో.. తల్లితో కొడుకు కబుర్లు.. ఆశ్యర్యపోతున్న వైద్యులు 
Mother Tattoos Keyboard On Her Arm So Her Mute Son Can Talk To Her

Updated on: Aug 31, 2026 | 4:40 PM

కెనెడాకు చెందిన జెసికా ఫ్లెచర్ 11 ఏళ్ల కొడుకు హంటర్‌ ఆటిజంతో బాధపడుతున్నాడు. తల్లితో ఏం చెప్పాలన్నా తన ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ (AAC) టాబ్లెట్ సాయం తీసుకుంటాడు. అయితే ఒక రోజు ఇద్దరూ కలిసి బయట భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో డివైజ్ లో బ్యాటరీ అయిపోయింది. అది లేకపోవడంతో  అమ్మ తో మాట్లాడే భాష ఆగిపోయింది.

టెక్నాలజీ ఫెయిల్ అయినప్పటికీ హంటర్ ఏ మాత్రం కంగారుపడలేదు. దానికి బదులుగా, అతను ఒక నాప్‌కిన్ తీసుకుని దానిపై కీబోర్డ్ గీసి, తనకు ఏమి ఆర్డర్ చేయాలో తన వేలితో చూపించాడు.  జెస్సికాకు ఆ క్షణం ఊహించని ఒక ఐడియా వచ్చింది.  టెక్నాలజీ ఫెయిల్ అయినప్పుడు కూడా హంటర్ కు ఎప్పుడూ ఒక కీబోర్డ్‌ను అందుబాటులో ఉంచగలిగితే ఎలా ఉంటుంది?

బ్యాటరీ అయిపోయిన క్షణం.. పుట్టిన కొత్త ఐడియా!

తర్వాత జెస్సికా తన ముంజేతిపై కీబోర్డ్‌ టాటూ వేయమని ఒక ట్యాటూ ఆర్టిస్ట్‌ను సంప్రదించింది. ఆ డిజైన్‌లో అక్షరాలతో పాటు హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్, ఐ లవ్ యూ హార్ట్ సింబల్ వేయించింది. కొడుకు కోసం నొప్పిని పంటి కిందే భరించింది.  దానిని చూసిన వెంటనే హంటర్ ఉపయోగించడం ప్రారంభించాడు. తన తల్లి  పచ్చబొట్టు ద్వారా అతను మొదటిసారి కమ్యూనికేట్ చేసిన పదం “అమ్మా”.

మామూలుగా పార్కులు, హోటళ్లు లాంటి పబ్లిక్ ప్లేసెస్ లో డివైజ్ వాడినప్పుడు, అందులో నుంచి వచ్చే సౌండ్ కి చుట్టుపక్కల వాళ్ళంతా  చూసేవాళ్లు. కానీ ఇప్పుడు హంటర్ ఎవరికీ తెలియకుండా, నిశ్శబ్దంగా తన తల్లి చేతి మీద ఉన్న అక్షరాలను తాకుతూ తనకేం కావాలో చెబుతున్నాడు. దీంతో వాళ్ళిద్దరి ప్రపంచం చాలా ప్రైవేట్ గా, అందంగా మారింది.

తన కొడుకు మాట్లాడే సామర్థ్యం పూర్తిగా ఒక ఎలక్ట్రానిక్ పరికరంపై ఆధారపడకూడదని ఈ అనుభవంతో తనకు అర్థమైందని జెస్సికా అన్నారు. అక్షరాలు రాని చోట అమ్మ చెయ్యే భాష అయింది. “నా కొడుకులా ఇతర చిన్నారులకు కూడా వాళ్ళ మనసులోని భావాలను చెప్పే అవకాశం ఇస్తే, నిజంగా వాళ్లు ఎంత గొప్పవాళ్లో మనకు అర్థమవుతుంది” అంటుంది జెస్సికా. ఆమె అన్నదాంట్లో నిజం ఉంది. బ్యాటరీ చార్జింగ్ అయిపోయి ట్యాబ్ ఆగిపోవచ్చేమో కానీ, అమ్మ ప్రేమ ఎప్పటికీ ఆగిపోదు కదా!

 

వైరల్ అయిన వీడియో..

హంటర్ ఈ టాటూను వాడుతున్న వీడియోను జెస్సికా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఏకంగా 20 లక్షల లైక్స్ వచ్చాయి. అది చూసిన హంటర్ స్కూల్ ఫ్రెండ్స్.. తమకు కూడా అలాంటి కీబోర్డ్ ఉన్న టీ-షర్ట్స్ కావాలనీ అడిగారు.  ఆడుకునేటప్పుడు హంటర్ తో సైలెంట్ గా మాట్లాడగలమని అన్నారు. పిల్లల ప్రేమ చూసి ఒక దుస్తుల కంపెనీ వాళ్ళు అలాంటి కీబోర్డ్ షర్ట్స్ తయారు చేయడానికి ముందుకొచ్చారు. చాలా మంది టాటూ ఆర్టిస్టులు , ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఇలాంటి టాటూలు ఫ్రీగా వేస్తామని ముందుకురావడంతో ఈ  రియల్ లైఫ్ స్టోరీ హృదయాలను హత్తుకుంటోంది.

తన కొడుకుకు మాటలు రాకపోయినా, అతను చెప్పాలనుకున్న మాటలకు ఏదీ అడ్డంకి కాదని, అతనికి ఎప్పటికీ ఆ లోటు తెలియకూడదని జెస్సికా చేసిన ప్రయత్నం మంచి ఫలితం ఇవ్వడంతో  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆటిజం పిల్లల తల్లితండ్రులు ఆమెను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు.  ఆటిజం చికిత్సలో ఇప్పటివరకు తెలియని విషయాన్ని ఆ తల్లి చేసి చూపించడంతో ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us