
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కడప-మైదుకూరు ప్రధాన రహదారిపై ఉన్న పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రోడ్డు దాటుతున్న ఒక కోతిని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ కోతి శరీరం రోడ్డుపైనే నిర్జీవంగా పడి ఉంది. వెళ్లేవారంతా దాన్ని చూస్తూ వెళ్లిపోయారే తప్ప ఎవరూ స్పందించలేదు. చివరకు ఆ దారిలో వెళ్తున్న కొందరు స్థానికులు దీనిపై స్పందించి, మూగజీవాల సంరక్షణలో ముందుండే నేస్తం సేవా సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే నేస్తం సేవా సంస్థ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న కోతి మృతదేహాన్ని పక్కకు తీసి, దానికి తగిన గౌరవం ఇస్తూ అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మంలో కోతులను హనుమంతుడి స్వరూపంగా భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఆ కోతి శరీరానికి పూలమాలలు వేసి, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “చనిపోయిన మూగ జీవాలకు అంత్యక్రియలు నిర్వహించడం కేవలం సేవ మాత్రమే కాదు, వాటిని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో మనందరిపై ఉంది” అని గుర్తుచేశారు.
నేస్తం సేవా సంస్థ కేవలం చనిపోయిన జీవాలకే కాకుండా, బ్రతికున్న మూగజీవాల సంరక్షణ కోసం కూడా నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్షులు, జంతువులు తాగునీరు దొరకక అల్లాడిపోతున్నాయి. దీనికోసం ఈ సంస్థ వారు జంతువులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలను గుర్తించి, అక్కడ నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఆ తొట్టెల్లో ప్రతిరోజూ ఉదయాన్నే స్వచ్ఛమైన నీటిని నింపుతూ మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నారు. నేస్తం సంస్థ చేస్తున్న ఈ మంచి పనిని మైదుకూరు ప్రజలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..