మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్ సునామీ … ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు

|

Aug 29, 2024 | 12:32 PM

ఇప్పటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రముఖ నటి సోనియా మల్హర్ 2013లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా సెట్లో తనను లైంగికంగా వేధించారని సిట్‌కి ఫిర్యాదు చేశారు.

మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్ సునామీ ... ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు
Tsunami in Mollywood
Follow us on

అంతులేని ఆ వినీలాకాశం నిండా మిల మిలా మెరిసే నక్షత్రాలు.. అందమైన చందమామ.. వెన్నెల రాత్రుల్లో కంటికి ఇంపుగా కనిపించే దృశ్యాలివి. కానీ అత్యంత మనోహరంగా కనిపించే ఆ ఆకాశం నిండా ఎన్నో అంతు చిక్కని రహస్యాలుంటాయి. అయితే నిజంగా ఆ నక్షత్రాలు మెరిసేవీ కావు.. చంద్రుడు భూమిపై నుంచి కనిపించే అంత అందగాడు కూడా కాదు.. ఇది సైన్స్ చెప్పే నిజం. కంటికి కనిపించేదంతా అన్ని సార్లు నిజం కాదు.. ఒక్కోసారి ఉప్పు కూడా పంచదారలానే కనిపిస్తుంది.

ఇవన్నీ తాజాగా మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్ తన నివేదిక ప్రారంభంలో ప్రస్తావించిన వాక్యాలు. నిజానికి ఈ 2-3 వాక్యాలతోనే తన 295 పేజీల రిపోర్ట్‌లో ఏమందన్న విషయాన్ని స్పష్టంగా తేల్చేసింది. సరే అందులో 63 పేజీలు ఎందుకు తొలగించారన్నది వేరే విషయం. రిపోర్ట్ రిలీజైన మొదట్లో కేవలం మాలివుడ్‌కి మాత్రమే పరిమితం అనుకున్న ఈ దుమారం. రోజులు గడిచే కొద్దీ విస్తరించడం మొదలైంది. అసలు నివేదికలో ఏముంది..? నివేదిక విడుదలైన తర్వాత తలెత్తిన పరిణామాలపై గతంలోనే ఓ కథనాన్ని ప్రచురించాం కనుక.. ఇప్పుడు ఆ వివరాలను మళ్లీ ప్రస్తావించడం లేదు. (ఆ కథనం కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి. )

2019లోనే నివేదిక

నిజానికి ఈ నివేదికను 2019లోనే కమిటీ ప్రభుత్వానికి అందించింది. అయితే అనేక చట్టపరమైన కారణాలు, ఇతర కారణాల వల్ల ఇప్పటి వరకు దాన్ని బయట పెట్టలేదు కేరళ ప్రభుత్వం. ఆ నివేదికను విడుదల చెయ్యవద్దంటూ గతంలో ఓ మలయాళ చిత్ర నిర్మాత వేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు డిస్మిస్ చెయ్యడంతో ప్రభుత్వం దానిని బాహ్య ప్రపంచంలోకి తీసుకొని రాక తప్పలేదు. అయితే ఇందులో వ్యక్తిగత గోప్యతను దృష్టిలో పెట్టుకొని బాధితులు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.

ఈ రిపోర్ట్ బయటకు వెల్లడి కావడంతోనే మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ కుదుపు మొదలయ్యింది. ఆలోచనాత్మక చిత్రాలకు, ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే మాలీవుడ్ తెర వెనుక ఇన్ని చీకటి కోణాలున్నాయా అన్న విషయం హేమ కమిటీ నివేదిక బయటపడిన తర్వాతే బాహ్య ప్రపంచానికి వెల్లడయ్యింది. దీంతో ఇన్నాళ్లూ వేధింపుల్ని భరిస్తూ చీకట్లోనే ఉండిపోయిన బాధితులు ఒక్కొక్కరూ బయటకొస్తున్నారు. తాము ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడిస్తున్నారు. మరి కొందరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు కూడా.

ఇప్పటి వరకు 17 కేసులు

ఇప్పటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రముఖ నటి సోనియా మల్హర్ 2013లో ఓ సినిమా షూటింగ్లో భాగంగా సెట్లో తనను లైంగికంగా వేధించారని సిట్‌కి ఫిర్యాదు చేశారు.

Sonia Malhar

మరో నటి మిను మునీర్ కూడా నటులు ముఖేష్, జయసూర్య, మనియన్పిళ్ల రాజు, ఇద్వేల బాబు తనను షూటింగ్ సమయాల్లో వేధించారని ఆరోపించారు. తాజాగా వాళ్లు తనను బెదిరిస్తూ మేసెజ్‌లు పెడుతున్నారంటూ ఓ స్క్రీన్ షాట్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఓ షూటింగ్ సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లి బయటకు వచ్చిన తనను నటుడు జయసూర్య కౌగిలించుకోవడమే కాకుండా, తన ప్రమేయం లేకుండానే ముద్దు పెట్టారని.. ఊహించని ఆ ఘటనతో తాను షాక్‌గురై అక్కడ నుంచీ పారిపోయానంటూ తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆయనతో ఉన్నట్టయితే తనకు మరిన్ని అవకాశాలిస్తానని కూడా జయసూర్య ఆఫర్ చేశారని కూడా ఆరోపించారు. అలాగే AMMA సెక్రటరీ బాబు కూడా తనకు AMMAలో సభ్యత్వం ఇప్పిస్తానని చెప్పి ఫ్లాట్‌కి రమ్మని పిలచి శారీరకంగా వేధించారని కూడా మునీర్ ఆరోపణలు చేశారు. ఇలాంటి అనుభవాలు చాలా మందితో తనకెదురయ్యాయన్నది మునీర్ ఆరోపణ. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ముఖేష్ రియాక్టయ్యారు. గతంలో తనను మునీర్ ఆర్థికంగా సాయం అడిగారని, కాదన్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నది ఆయన వాదన. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరగాలని ఆయన కూడా డిమాండ్ చేశారు.

Minu Muneer

మరోవైపు బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా దర్శకుడు రంజిత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు సర్వ సాధారణం అన్నది ఆమె వాదన. ఆ విషయం అందరికీ తెలుసని, ఓ రకంగా చెప్పాలంటే ఇది ఇండస్ట్రీలో సాధారణ విషయంగా మారిపోయిందని శ్రీలేఖ చెబుతున్నారు.

నివేదిక ఆలస్యంపై విమర్శలు

నిజానికి ఈ నివేదిక బయట పెట్టగానే… తొలిసారి స్పందించిన బాలివుడ్ నటి తనూ శ్రీ దత్తా… ఈ విషయం తేల్చడానికి ఇన్నేళ్లు పట్టిందా అంటూ కమిటీపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా దానిని దాచి పెట్టడంపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ కమిటీలన్నీ కాలక్షేపం కోసమే తప్ప పెద్దగా ఉపయోగం లేదన్నది ఆమె మాట. గతంలో తనను వేధించారంటూ నటులు దిలీప్, నానా పటేకర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా హేమ కమిటీ నివేదికపైనే అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. వేధింపులకు పాల్పడిన వారికి శిక్ష పడనంత వరకు ఇలాంటి కమిటీలు ఎన్ని వేసినా ఏం లాభం అన్నది తనూ శ్రీ దత్తా మాట.

IT’S TIME FOR CHANGE …

మరో సీనియర్ నటి రేవతి మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ ప్రెసిడెంట్ మోహన్ లాల్, అలాగే మరో సీనియర్ నటుడు మమ్ముట్టి ఇద్దరూ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బహుశా వారింకా ఈ షాక్ నుంచి కోలుకోలేదమో అని వ్యాఖ్యానించారు.. విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(WCC) సంస్థకు పౌండర్ మెంబర్‌గా ఉన్నారు రేవతి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినా రూమర్స్‌గానే మిగిలిపోయేవని.. హేమ కమిటీ నివేదిక ఇంత స్పష్టంగా కుళ్లిన వ్యవస్థ గురించి కుండబద్దలుకొట్టిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే కష్టమన్నది ఆమె మాట. తాజాగా తన ఫేస్ బుక్‌లో “బాధితులకు అండగా ఉండాల్సిన సమయం ఇదే… వారి తరుపున న్యాయం కోసం పోరాడాల్సిన సమయం ఇదే… మనలో ఉన్న సమస్యల్ని అంగీకరించి.. వాటికి పరిష్కారం వెతకాల్సిన సమయం కూడా ఇదే… రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్‌ను అందించాల్సిన సమయం కూడా ఇదే… ITS TIME FOR CHANGE” అంటూ పోస్ట్ చేశారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Revathi

అటు WCC పై ప్రశంసలు కురిపించారు మరో నటి సమంత. వారి కృషి వల్లే హేమ కమిటీ రిపోర్ట్  ఇచ్చిందని కమెంట్ చేశారు.  ఇప్పటికేనా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి  సారించి తగిన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు సమంత పేర్కొన్నారు.

దక్షిణాదికి చెందిన మరో సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్‌బూ సుందర్ కూడా రియాక్ట్ అయ్యారు. తమపై జరుగుతున్న వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన వారిని మెచ్చుకోవాలంటూ ట్వీ ట్ చేశారు. ఈ విషయంలో హేమ కమిటీ నివేదిక ఎంతగానే ఉపయోగపడిందన్నది ఆమె మాట. కెరీర్లో ఎదగాలంటే కమిట్మెంట్ లేదా కాంప్రమైజ్ కావాలని కోరడం కేవలం మహిళలకు మాత్రమే కాదని, పురుషులకు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉండొచ్చని అన్నారు. అయితే ఎక్కువగా వేధింపులు ఎదుర్కొనేది మాత్రం మహిళలేనంటూ ట్వీ ట్ చేశారు. ఇలాంటి వేధింపులు ఎదురైన వెంటనే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చెయ్యాలని, అయితే దురదృష్టవశాత్తు అలాంటి మహిళలకు కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన కన్న తండ్రే తనను వేధింపులకు గురి చేసిన ఘటనల్ని మరోసారి ప్రస్తావించారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Khushbu

AMMAపై విమర్శలు

ఈ విషయంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరుపైనా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పు AMMA సరైన తీరులో వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు ప్రముఖ హీరో పృథ్విరాజ్. మరోవైపు హేమ కమిటీ రిపోర్ట్ వెల్లడైన తర్వాత పరిణామాల నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్యక్షుడు మోహన్‌లాల్ సహా కార్యనిర్వాహక సభ్యులంతా తమ పదవులకు రాజీనామా చేశారు.

టాలివుడ్ పరిస్థితేంటి?

టాలివుడ్‌లో అప్పుడప్పుడు ఒకటి అరా ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ మలాయళ సినీ పరిశ్రమలో వచ్చినంతగా రాలేదు. గతంలో ఒకరిద్దరు నటుల విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ తర్వాత వాటికి పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. అదీగాక మాలివుడ్‌లో బహిరంగంగా ఫిర్యాదులు చేసినట్టు టాలివుడ్‌లో ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవనే చెప్పాలి. తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో నటి మాధవీ లత, రాధికా ఆప్టే వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవ్వరూ బహిరంగ వ్యాఖ్యలు చెయ్యలేదు.

 

ఇది మరో మీటూ ఉద్యానికి దారి తీస్తుందా?

2006లో అమెరికాలో మీ టూ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత 2017 నాటికి అది ప్రపంచమంతా వ్యాపించింది. పని చేసే చోట మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి గొంతెత్తడం ఈ ఉద్యమం ప్రధాన ఉద్ధేశం. అప్పట్లో ప్రముఖ హాలివుడ్ నిర్మాత హార్వే విన్‌స్టైన్‌ మీ టూ ఉద్యమం దెబ్బకు అడ్రస్ లేకుండా పోయారు. ఆ తర్వాత అదే ఉద్యమం బాలివుడ్‌కి కూడా పాకింది. 2018లో తనూ శ్రీ దత్తా నానా పటేకర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. మరోవైపు పటేకర్ తనపై వచ్చిన ఆరోపణల్ని కొట్టి పారేశారు. ఆ తర్వాత ముంబై పోలీసులు పటేకర్‌పై చేసిన ఆరోపణల విషయంలో సరైన ఆధారాలు లేవంటూ 2019లో ఈ కేసును క్లోజ్ చేశారు.

అలాగే ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్‌, ఖైలాష్ ఖేర్ వంటి వారిపైనా ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ తర్వాత అవి ముందుకు సాగలేదు. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిను మునీర్ పలువురు నటులు తనను వేధించారంటూ మీడియాకెక్కారు. హేమ కమిటీ రిపోర్ట్ పుణ్యమా అని మరింత మంది బాధితులు తాము ఎదుర్కొంటున్న వేధింపులపై గళం విప్పే అవకాశం వచ్చిందన్నారు
ప్రముఖ గాయని చిన్మయ శ్రీపాద. గతంలో మీటూ ఉద్యమంలో గళమెత్తిన ఆమె గేయ రచయిత వైరముత్తు, నటుడు రాధా రవిలపై తాను ఆరోపణలు చేసినప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడిన చిన్మయ.. ఈ విషయంలో తక్షణం బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలేవీ బాధితులకు న్యాయం చేసేలా లేవని, సుదీర్ఘ కాలం కొనసాగే విచారణలు వారి పాలిట శాపంగా మారాయని అన్నారు.

అయితే హేమ కమిషన్ నివేదిక విడుదలై రోజులు గడుస్తున్న ఇప్పటికీ చాలా మంది సినీ పెద్దలు ఈ విషయంలో నేరు మెదపడం లేదు. పండగలకు, పబ్బాలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ తెగ యాక్టివ్‌గా ఉండే చాలా మంది నటీ నటులు … సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న ఈ కు సంస్కృతి గురించి మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతి చోటా ఇదే పరిస్థితా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులు వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన వాళ్లకు పెద్దగా ఎదురుకావు. కానీ కొత్తగా ఈ రంగంలో ఎదగాలనుకునే వాళ్లకు, ఎన్నో ఆశలతో రంగులలోకంలోకి వచ్చి ఆ తర్వాత ఏ జూనియర్ ఆర్టిస్టుగానే, క్యారక్టర్ ఆర్టిస్టుగానే ఇండస్ట్రీలో సెటలైన వాళ్లకు ఏదో ఒక సమయంలో వేధింపులు సర్వ సాధారణం అన్న విషయం జగమెరిగిన సత్యం. ఈ వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు… అన్ని చోట్లా ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటోంది. వర్క్ ప్లేస్‌లో మహిళలకు రక్షణ అందించే విషయంలో కొన్ని కార్పోరేట్ సంస్థలు స్వీయ నియమాలను ఏర్పాటు చేసుకొని కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నప్పటికీ.. చాలా సంస్థల్లో అలాంటి ఏర్పాట్లు లేవు. అందులోనూ వెండితెర వెలిగిపోవాలని వచ్చి… ఆ మసక మసక చీకట్లలో గడిపే జీవితాల గురించి ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి హేమ కమిషన్ రిపోర్టుల ద్వారా ప్రపంచానికి తెలియడం.. కొద్ది రోజుల పాటు చర్చ నడవటం.. ఆ తర్వాత మళ్లీ పరిస్థితులు మాములు కావడం ఇది సర్వ సాధారణంగా మారుతోంది. మరి ఈ సారి మలయాళ సినీ పరిశ్రమలో పుట్టిన ముసలం… ఎటు దారి తీస్తుంది..? లెట్స్ వెయిట్ అండ్ సీ….

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి