
భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో హిమాలయ మూలికలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. అలాంటి అరుదైన, అత్యంత విలువైన మూలికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని మిష్మి కొండలలో లభించే మిష్మి తీతా ఒకటి. దీనిని స్థానికంగా మమీరా అని, ఆంగ్లంలో గోల్డ్ థ్రెడ్ అని పిలుస్తారు. బంగారం రంగులో ఉండే దీని వేర్లు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉండటంతో మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.
ఈ మొక్క ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని మిష్మి కొండలలో, సముద్ర మట్టానికి దాదాపు 2,000 నుండి 3,000 మీటర్ల ఎత్తులో ఉండే చల్లని, తేమతో కూడిన నిత్యహరిత అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. చైనా సరిహద్దులోని టిబెట్, మిజోరాం, నాగాలాండ్ మరియు మ్యాన్మార్ సరిహద్దు అడవులలో కూడా ఇది అరుదుగా కనిపిస్తుంది.
మిష్మి తీతా వేర్లలో బెర్బెరిన్ అనే ముఖ్యమైన ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ శక్తివంతమైన బాక్టీరియా నిరోధక, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. పూర్వకాలం నుండి మిష్మి తెగ ప్రజలు మలేరియా, తీవ్రమైన జ్వరం, టైఫాయిడ్ నివారణకు దీనిని ప్రధాన నివారణగా వాడేవారు.
కంటి సంబంధిత వ్యాధులు, మంటలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. విరేచనాలు, కడుపునొప్పి, కామెర్లు, జీర్ణకోశ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ఈ మూలిక తోడ్పడుతుంది.
మిష్మి తీతా లభ్యత తక్కువగా ఉండటం, ఔషధ రంగానికి దీని అవసరం ఎక్కువగా ఉండటంతో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.. భారతీయ విపణిలో నాణ్యమైన ఎండిన వేర్ల ధర కిలో రూ. 3,000 నుండి రూ. 9,000 వరకు ఉంటుంది. ఆర్గానిక్ మెడిసిన్ గ్రేడ్ కింద విక్రయించే ప్రాసెస్డ్ మూలికల ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది.
అధికంగా త్రవ్వితీసి అమ్మడం, అటవీ విస్తీర్ణం తగ్గడం, అక్రమ రవాణా కారణంగా ఈ మొక్క ప్రస్తుతం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. రెడ్ డేటా బుక్ లో అంతరించిపోతున్న వృక్ష జాతుల పట్టికలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఐయూసీఎన్ దీనిని చేర్చాయి. దీనిని రక్షించుకోవడానికి సంరక్షణ చర్యలు చేపట్టడం ఎంతో అత్యవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..