
మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్ వైద్యులు ఒక ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి ఛాతీలో ఇరుక్కుపోయిన కొబ్బరి ఈకను, దాన్ని చుట్టూ ఉన్న దారాన్ని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. డాక్టర్ సురేష్ పాయ్ నేతృత్వంలోని వైద్యబృందం సుమారు రెండు గంటల పాటు శ్రమించి.. ఆ బాలుడికి పునర్జన్మను ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే..
అస్సాంకు చెందిన ఓ కార్మిక కుటుంబం మడికేరిలో నివసిస్తోంది. శనివారం సాయంత్రం, ఆ కుటుంబానికి చెందిన హసన్ అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా.. అతడిపై ఓ కొబ్బరి మట్ట పడింది. ఇక అందులోని ఓ కొబ్బరి ఆకు.. ఆ బాలుడి మెడ చుట్టూ ఉన్న చైనుతో పాటు ఛాతీలోకి చొచ్చుకుపోయింది. నొప్పితో విలవిలాడిన బాలుడ్ని.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. కానీ మడికేరి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడ్ని మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. ఇక అక్కడి డాక్టర్లు.. ఆ బాలుడికి కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జరీ చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్లు విజయవంతంగా కొబ్బరి ఆకును, చైనును తొలగించారు. కాగా, ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని.. ఆరోగ్యకరంగానే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి