ఈరోజుల్లో ప్రేమ అనేది అవసరంగా మారిపోయింది. ఆ పేరుతో అబ్బాయిలు, అమ్మాయిలు చేసే పనులు అన్నీఇన్నీ కాదు. ఇటీవల కాలంలో టైంపాస్ ప్రేమలు ఎక్కువైపోయాయి. నిజాయితీగా ప్రేమించేవారు తక్కువైపోయారు. కేవలం పైపై హంగులతో.. బయటికి ఓవర్ యాక్షన్ చేసే జంటలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు.
సాధారణంగా అబ్బాయిలు తమ ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. దానికి కారణాలు లేకపోలేదు. అది వారి నిజాయితీ గల ప్రేమకు నిదర్శనమో.. లేక ఆ అమ్మాయి వారికే సొంతమనే ఫీలింగో గానీ అబ్బాయిలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా.. అప్పుడప్పుడూ అప్పులు కూడా చేసి మరీ ప్రేమించిన అమ్మాయికి ఇస్తుంటారు. ఇక దీన్నే కొంతమంది అమ్మాయిలు అవకాశంగా తీసుకుని.. ప్రియుడ్ని ఏటీఎం కార్డులా వాడేస్తారు. సరిగ్గా ఇదే తరహాలో ఓ వ్యక్తి తన ప్రియురాలు అడిగింది కొనిచ్చాడు. అవసరమైనప్పుడల్లా అడిగినంత డబ్బు ఇచ్చాడు. అంతేకాదు ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రి ఖర్చులు భరించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆమె తల్లి చికిత్స పొందుతూ చనిపోయింది. అయినా బాధలో ఉన్న ప్రియురాలిని వదల్లేదు. ఆమెకు తోడుగా ఉండి అంత్యక్రియల ఖర్చులు సైతం భరించాడు.
సీన్ కట్ చేస్తే.. ఆ అమ్మాయి ఒకానొక రోజు అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇంకేముంది మనోడు దేవదాసుగా మారాడని అనుకుంటున్నారా.? లేదు.. తన ప్రియురాలికి ఖర్చుపెట్టిన సొమ్మును మొత్తం డైరీలో భద్రపరిచాడు. ఆ మొత్తం బిల్లులు ఆమెకు పంపించి.. పరిహారం చెల్లించాలని అడిగాడు. ఇక సదరు యువతికి ఆ బిల్లులు మొత్తం చూసి కళ్లు బైర్లు కమ్మాయి.
వీరిద్దరి మధ్య డేటింగ్ మొదలైన ఫస్ట్ డే నుంచి బ్రేకప్ చెప్పే ముందు రోజు వరకు అతడు ప్రియురాలికి ఇచ్చిన ప్రతీ పైసాకైన ఖర్చును చాలా క్లియర్‌గా డైరీలో నోట్ చేశాడు. చిన్న మొత్తాన్ని సైతం విడిచిపెట్టలేదు. ప్రతీ బిల్లు రాసి పెట్టుకున్నాడు. ఇలా సుమారు 100 బిల్స్‌ను నోట్ చేసిన ఆ వ్యక్తి.. లెక్క మొత్తాన్ని చూడగా 72 వేల యువాన్స్ (ఇండియన్ కరెన్సీలో రూ. 8.41 లక్షలు) తేలింది. ఇందులో కొంత కన్సెషన్ ఇచ్చిన అతడు 60,147,025 యువాన్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 7 లక్షలు) బ్రేకప్ బిల్లుగా చెల్లించాలని మాజీ ప్రియురాలికి పంపించాడు.
దీనికి ఆమె నుంచి ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలియదు గానీ.. ప్రస్తుతం అతడి బ్రేకప్ బిల్లులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొంతమంది అతడికి మద్దతుగా కామెంట్ చేస్తుంటే.. మరికొందరు అతడ్ని విమర్శిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.