చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యనివాళ్లు ఈ జిందగీలో బహుశా ఉండరేమో.. కడుపునొప్పి, దొంగ జ్వరం.. ఇలా కుంటిసాకులు చెప్పి ప్రతిఒక్కరూ స్కూల్‌కి ఎగనామం పెట్టడానికి ప్రయత్నించిన వాళ్లే. తల్లిదండ్రులు చాక్లెట్, బిస్కెట్లు, బొమ్మలు ఇలా ఏదోఒకటి ఇచ్చి బుజ్జగించి స్కూల్‌కి పంపేపారు. ఐతే ఈ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం కొంచెం వెరైటీ. బడికి వెళ్లనని కూతురు ఏడుస్తుంటే ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి లగ్జరీ కారు కొనిచ్చారండీ. అంతే కూతురు ఎగిరి గంతేసి చక్కా స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించింది. ఇంతకీ ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే..
మలేషియాకు చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రాకు ఐదేళ్ల కుమార్తె ఫాతిమా ఒక్కతే సంతానం. అనారోగ్యంతో కూతురు ఫాతిమా జనవరిలో స్కూల్‌కి వెళ్లడం మానేసింది. ఆరోగ్యం కోలుకున్న తర్వాత స్కూల్‌కి వెళ్లనని మారం చేయసాగింది. ఐతే కూతురిని తిరిగి స్కూల్‌కి ఎలా పంపాలా అని తల్లి ఆలోచించిన ఫర్హానా తన రాబోయే పుట్టిన రోజుకి ఏం గిఫ్ట్ కావాలంటూ కుమార్తె ఫాతిమాను అడిగింది. తనకు బీఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిడెస్ జి వ్యాగన్ కావాలని, అది ఇస్తే రోజూ స్కూల్‌కి వెళ్తానని ఐదేళ్ల చిన్నారి తల్లి ఫర్హానాకు చెప్పింది. అన్నమాట ప్రకారం ఫాతిమా పుట్టిన రోజుకు లగ్జరీ ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇచ్చింది. దీంతో తన కోరిక నెరవేరడంతో చిన్నారి స్కూల్ వెళ్లి బాగా చదువుకుని, డాక్టర్ అవుతానని తల్లిదండ్రులకు ప్రామిస్ చేసింది.
స్కూల్‌కు వెళ్లేందుకు తన కూతురిని ప్రోత్సహించేందుకు తన భర్త ఈ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఫర్హానా స్థానిక మీడియాకు తెల్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదేళ్ల చిన్నారిని పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆ చిన్నారి ఎంతో అదృష్టవంతురాలని కొందరు అభినందిస్తుంటే.. అడిగినవన్నీ కొనిచ్చి తల్లిదండ్రులు ఆమెను చెడగొడుతున్నారని మరికొందరు విమర్శించారు. పిల్లల కలలు నెరవేర్చడం తప్ప పెద్దవాళ్లకు ముఖ్యమైన పనులు ఏముంటాయ్? ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.