
మరణం తర్వాత ఏం జరుగుతుంది.? ఆత్మ అనేది ఒకటి ఉంటుందా? ఈ ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం దగ్గర ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ, అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 80 ఏళ్ల పాస్టర్ నార్మా ఎడ్వర్డ్స్ చెబుతున్న విషయాలు వింటే సైన్స్ కూడా ఆలోచనలో పడాల్సిందే. ఆమె ఒక్కసారి కాదు.. ఏకంగా మూడుసార్లు క్లినికల్‌గా మరణించి, మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఆ మరణ ప్రయాణంలో ఆమె చూసిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. నార్మాకు 20 ఏళ్ల వయసులో మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు ఆమె చనిపోయిందని ధృవీకరించారు. ఆ సమయంలో తన ఆత్మ శరీరం నుండి విడిపోయి, ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలను పైనుంచి చూస్తున్నట్లు ఆమె వివరించారు. అది కేవలం భ్రమ కాదు ఒక అతీంద్రియ అనుభవమని ఆమె బలంగా నమ్ముతున్నారు.
మరణానంతర స్థితి గురించి నార్మా చెప్పిన వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి.. తాను ఒక చీకటి సొరంగం గుండా అత్యంత వేగంగా ప్రయాణించి, చివరకు అద్భుతమైన తెల్లని కాంతిని చేరుకున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఒక భారీ స్క్రీన్‌పై ఆమె జీవితం మూడు భాగాలుగా ప్రదర్శించబడింది. మరణించిన తన సోదరుడిని అక్కడ కలిశానని..”మరణం అనేది ముగింపు కాదు, జీవితం శాశ్వతమైనది అనే సందేశం తనకు లభించిందని ఆమె తెలిపారు.
తిరిగి ప్రాణాల్లోకి రావడం అనేది ఒక బాధాకరమైన ప్రక్రియ అని నార్మా అభివర్ణించారు. “నా ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. మొత్తం విశ్వాన్ని ఒక చిన్న టీ కప్పులోకి బలవంతంగా పిండేసినంత నరకాన్ని అనుభవించాను అని ఆమె ఆ వేదనను గుర్తు చేసుకున్నారు. ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత నార్మాలో కొన్ని మానవాతీత మార్పులు వచ్చాయి. ఆమె మనుషులను చూసినప్పుడు వారి శరీరంలోని అంతర్గత అవయవాలు కనిపించేవట. ఏదో తెలియని అతీంద్రియ శక్తి తనలో ప్రవహిస్తున్నట్లు ఆమె గ్రహించారు. 2024 నవంబర్‌లో మరో రెండుసార్లు గుండెపోటు వచ్చినా.. భూమిపై నీ పని ఇంకా పూర్తి కాలేదు అనే దేవదూతల సందేశంతో ఆమె మళ్ళీ కోలుకున్నారట.
ప్రస్తుతం నార్మా తన మిగిలిన జీవితాన్ని మరణశయ్యపై ఉన్నవారికి భరోసా ఇవ్వడానికి కేటాయిస్తున్నారు. మరణం అనేది గదిలో ఒక వైపు నుండి మరో వైపుకు వెళ్ళడం లాంటి మార్పు మాత్రమే. దానికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆమె చెబుతున్నారు. మొత్తానికి నార్మా ఎడ్వర్డ్స్ అనుభవాలు ఆధ్యాత్మిక, పారానార్మల్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. మరణం అంటే కేవలం దేహం రాలడమే తప్ప, ప్రయాణం ఆగదు అని ఆమె మాటలు నిరూపిస్తున్నాయి.