భర్తను కోల్పోయిన, తన పిల్లల ఆకలి తీర్చేందుకు డబ్బులేక కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ మహిళ సాయం కావాలంటూ సోషల్ మీడియాలో అభ్యర్థించింది. దీంతో ఊహించని రీతిలో ఆమెకు విరాళాల రూపంలో లక్షలాది రూపాయల సాయం అందింది. వివరాల్లోకెళ్తే..
కేరళకు చెందిన సుభద్ర (46) భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు బిడ్డల తల్లైన సుభద్రకు పూట గడవడమే కష్టంగా మారింది. చిన్న కొడుక్కి సెలబ్రల్ పాల్సి వ్యాధి ఉండటంతో ఎల్లప్పుడూ దగ్గరే ఉండవల్సిన పరిస్థితి. దీంతో కుటుంబ జీవనానికి ఉపాధిలేక తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలో గత శుక్రవారం (16) తన రెండో కొడుకు చదివే స్థానిక పాఠశాల హిందీ టీచర్ గిరిజ హరికుమార్ వద్దకు వెళ్లి రూ.500లు సాయం కోరింది. ఆమె దీనపరిస్థితిని చూసి చలించిపోయిన టీచర్ గిరిజ హరికుమార్ రూ.1000లు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఫేస్ బుక్‌లో క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తోచినంత సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తన పోస్టులో కోరారు. అలాగే ఆ పోస్టులో సుభద్ర బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా జత చేయడంతో.. దాతలు అందించే డబ్బు నేరుగా సుభద్ర అకౌంట్లోకి చేరాయి.
దీంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అంటే డిసెంబర్ 18 నాటికి రూ.55 లక్షలు సమకూరాయి. దీంతో టీచర్ చేసిన సాయం మర్చిపోలేనిదని, దిక్కులేని తన కుటుంబానికి చుక్కానిలా దారి చూపించిన దేవత అంటూ సుభద్ర మీడియాకు వివరించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.