
భారతదేశం తన విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ప్రత్యేకమైన నమ్మకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవం అనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్న గ్రామాలు చాలా ఉన్నాయి. వీటిలో, కొన్ని గ్రామాలలో పాములను కేవలం ప్రాణులుగా మాత్రమే కాకుండా పవిత్రమైనవిగా పూజిస్తారు. నాగపంచమి వంటి పండుగల నాడు, ఈ గ్రామాలలో కుటుంబ సంతోషం, శ్రేయస్సు, మంచి పంట కోసం ప్రజలు సర్పదేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అందులో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న షెట్‌పాల్ (Shetphal) గ్రామం అత్యంత విచిత్రమైనది. ఈ ఊరిని పాముల గ్రామం అని పిలుస్తారు. ఇక్కడి ప్రజలు విషపూరితమైన కింగ్ కోబ్రా (నాగుపాములు) లతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
పూణే నగరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న షెట్‌పాల్ గ్రామంలో దాదాపు 2,600 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ ఊరిలో మనుషుల కంటే పాముల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు నాగుపాములను భయంకరమైన జీవులుగా కాకుండా, తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ప్రతి ఇంట్లో పాములు ఎండ నుండి ఉపశమనం పొందడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా పైకప్పులో లేదా గోడలలో దేవస్థానం (Devasthanam) పేరుతో ఒక ప్రత్యేకమైన డొల్ల (హోలో) స్థలాన్ని నిర్మిస్తారు. గ్రామంలో ఎవరు కొత్త ఇల్లు కట్టుకున్నా, పాముల కోసం ఈ ప్రత్యేక స్థలాన్ని నిర్మించడం ఇక్కడ తప్పనిసరి ఆచారం.
ఈ ఊరి వీధుల్లో, ఇళ్ల నడుమ, పొలాల్లో నాగుపాములు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. విచిత్రమేమిటంటే, పాఠశాలల్లో క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా పాములు తరగతి గదుల్లోకి వస్తుంటాయి. కానీ ఉపాధ్యాయులు గానీ, విద్యార్థులు గానీ ఏమాత్రం భయపడరు. ఇక్కడి పిల్లలు చిన్నతనం నుంచే ఈ భయంకరమైన సర్పాల మధ్య పెరుగుతారు. కాబట్టి, వారు నాగుపాములను పెంపుడు జంతువుల్లా భావించి వాటితో ఆడుకుంటారు. నాగపంచమి పండుగ రోజున ఈ గ్రామానికి దేశ విదేశాల నుండి వేలాది మంది పర్యాటకులు, డాక్యుమెంటరీల తయారీదారులు తరలివస్తుంటారు. ఆ రోజున గ్రామస్థులు సజీవ నాగుపాములకు పాలు పోసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శాస్త్రీయంగా నాగుపాము కాటు వేస్తే మనిషి నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతాడు. కానీ, షెట్‌పాల్ గ్రామంలో శతాబ్దాలుగా మనుషులు, పాములు కలిసి జీవిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా పాము కాటుకు గురై మరణించినట్లు రికార్డులు లేవు. ఒకరినొకరు గౌరవించుకోవడం, వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకపోవడం వల్లే పాములు కూడా ఇక్కడి ప్రజలపై దాడి చేయవని గ్రామస్థులు నమ్ముతారు. ప్రకృతితో, వన్యప్రాణులతో మనిషి ఎలా సామరస్యంగా జీవించవచ్చో చెప్పడానికి షెట్‌పాల్ గ్రామం ఒక సజీవ ఉదాహరణ.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..